వైభవంగా విగ్రహ పున:ప్రతిష్ఠాపన: మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి 

ఇచ్చోడ, వెలుగు: ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా దేవాలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మారుస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్​జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా ఆలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన శనివారం జరిగింది. ఈ సందర్భంగా మెస్రం వంశీయులతో కలిసి మంత్రి నాగదేవునికి  పూజలు చేశారు. ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి, అభివృద్ధి పనులపై అధికారులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు సూచనలు చేశారు.

నాగోబా అభివృద్ధికి  ప్రభుత్వం రూ.10.35 కోట్లు మంజూరు చేసిందన్నారు. మెస్రం వంశీయులు రూ.5 కోట్ల  విరాళాలతో గర్భగుడిని నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  ఏర్పాట్లు చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడి రేవుల్ పద్మ పూరి ఆలయానికి రూ.50 లక్షలు, జంగు భాయి ఉత్సవానికి ప్రతి ఏటా రూ.10 లక్షలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 100 ఆలయాలు కట్టేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. నాగోబా జాతర, పూజా కార్యక్రమం రోజున ప్రజలకు పౌష్టికాహార ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు. పోడు భూముల సర్వే పూర్తి చేయడంతో పాటు త్వరలోనే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జడ్పీ చైర్మన్​రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీ జి. నగేశ్,  కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి, ఆలయ పీఠాధిపతి వెంకటరావు, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కే రావు, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఇంద్రవెల్లి, నేరేడిగొండ జడ్పీటీసీలు పుష్పలత, అనిల్ యాదవ్, కేస్లాపూర్ సర్పంచ్ రేణుక నాగనాథ్,  ఈఈ రాథోడ్ భీమ్​రావు పాల్గొన్నారు.