కరీంనగర్ జైల్లో సీఎం కేసీఆర్ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధం చేసిన గదిని సందర్శిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం ఉదయం 10.30 నిమిషాలకు కాంగ్రెస్ ప్రతినిధి బృందం కరీంనగర్ జైలుకు వెళ్లి, గదిని పరిశీలించనున్నట్లు చెప్పారు. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. గత రెండేళ్లుగా సీఎం కేసీఆర్ ను జైలుకు పంపుతామని బీజేపీ నేతలు మాటలు చెప్పడం తప్ప చేసిందేమి లేదని విమర్శించారు.
హన్మకొండలోని ఆర్ట్స్, సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన బండి సంజయ్..సీఎం కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఆయన కోసం కరీంనగర్, అదిలాబాద్, చర్లపల్లి జైళ్లల్లో గదులు సిద్దంగా ఉన్నాయన్నారు. బీజేపీ ప్రజల కోసం, ధర్మం కోసం పని చేస్తే.. కేసీఆర్ మాత్రం ఆయన కుటుంబం కోసం పని చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలి అని సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కార్ పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. లిక్కర్ స్కాం అంశాన్ని పక్కదారి పట్టించేందుకు హైదరాబాద్ అల్లర్లను తెరపైకి తెచ్చారని తెలిపారు.