- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఫ్లెక్సీలు పెడుతున్న ప్రజలు
- ‘మా గోస వినండి నాయకులారా.. లేదంటే ఎలక్షన్స్ బహిష్కరిస్తాం’అని స్పష్టం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తమ సమస్యలు పరిష్కరిస్తేనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని భద్రాద్రికొత్తగూడెం ప్రజలు స్పష్టం చేస్తున్నారు. తమ డిమాండ్లతో ఎక్కడికక్కడ ఫెక్ల్సీలు కతున్నారు. మరో వారం రోజుల్లోనే ఎన్నికలు ఉండడంతో ఆయా నియోజకవర్గాల క్యాండిడేట్లు, అధికారులు ఆందోళన చెందుతున్నారు.
షెడ్యూల్డ్ ప్రాంతంలో ఆదివాసీల అసైన్డ్ భూముల సర్వే నంబర్లు 286, 381లో భూములకు హక్కు దారుల పేర్లను ధరణిలో చేర్చకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ‘మా గోస వినండి నాయకులారా.. లేదంటే ఎలక్షన్స్ బహిష్కరిస్తాం’ అని బాధితులు తేల్చి చెబుతున్నారు. ఈ పరిస్థితి లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారు చెలక, బొజ్జల గూడెం, కొత్త చింతకుంట, లక్ష్మీపురంలో ఉంది. ఈ గ్రామాలకు చెందిన ప్రజలు బుధవారం గ్రామ పంచాయతీ పొలిమేరలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. త్రీఫేజ్ కరెంట్ సౌకర్యం కల్పించాలని, గిరి వికాసం కింద అర్హులైన రైతులకు బోర్లు మంజూరు చేయాలని డిమాండ్లను ఫ్లెక్సీలో పేర్కొన్నారు.
దళిత, నేతకాని కులస్థుల సమస్యలు పరిష్కరించే నాయకుడికే తాము ఓటు వేస్తామంటూ గుండాల మండలం చింతలపాడు గ్రామ మహిళా సమాఖ ఆధ్వర్యంలో గ్రామ పొలిమేరలో వారం రోజుల కిందట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేకపోవడంతో కరెంట్ సప్లై లేక ఇబ్బందులు పడుతున్నామని ఫ్లెక్సీలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
గొత్తికోయలుగా పిలిచే గొండి తెగలమైన తమను కోయలుగా గుర్తించి గెజిట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ చర్ల మండలంలోని బూర్గపాడుకు చెందిన గొండి యువసేన ఆధ్వర్యంలో గ్రామ పొలిమేరలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మూల ఆదివాసీలమైన తమకు ఎస్టీ కోయ ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం ఆపేయాలని, తమ గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చాలని అందులో పేర్కొన్నారు.
ALSO READ : కాంగ్రెస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి : గంగుల కమలాకర్https://www.v6velugu.com/brs-candidate-minister-gangula-kamalakar-alleged-that-the-conspiracies-of-congress-and-bjp-should-be-thwarted
ఇదే తరహా పలు సమస్యలపై ఆయా గ్రామాల్లో ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరిస్తేనే ఓటేస్తామంటూ గత ఎన్నికల్లో చుంచుపల్లి మండలంలోని గరిమెళ్ల పాడు గ్రామానికి చెందిన ప్రజలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఓటేయబోమని భీష్మించి కూర్చున్నారు. దీనికి స్పందించిన అప్పటి కలెక్టర్ గ్రామానికి వెళ్లి ప్రజలతో మాట్లాడిన తర్వాత గ్రామస్తులు పోలింగ్లో పాల్గొన్నారు.