రాబోయే పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. సికింద్రాబాద్ ఎంపీ సీటును లక్ష మెజారిటీ గెలిచి దానం నాగేందర్‌ను లోక్ సభకు పంపుతామన్నారు. అధికారం పోయిన మూడు నెలలకే బీఆర్ఎస్ పతనం మొదలైందన్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఇంత తక్కువ టైంలో దెబ్బతినలేదని ఆయన అన్నారు.
ఎంపీ ఎన్నికల్లో సిటీ పరిధిలో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. సికింద్రాబాద్‌కు, తెలంగాణకు కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి చేసిందేమీ లేదన్నారు. మూసీ నది ప్రక్షాళనను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 40 నుంచి 50 వేల కోట్లతో మూసీ నదిని అభివృద్ధి చేస్తామన్నారు. సూపర్ గేమ్ చేంజర్‌గా ట్రిపుల్ ఆర్ మారనున్నదని ఆయన అన్నారు. ట్రిపుల్ ఆర్ పనులను త్వరలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.