- లక్ష 30 వేల ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తుంది
- బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కైనా ప్రజల ఆదరణ మాకే
- పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని లక్షా 30 వేల ఓట్ల మెజార్టీతో పక్కాగా గెలవబోతున్నామని నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల కో ఆర్డినేటర్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పోలింగ్ జరిగిన తీరు ఇతర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ అంచనాకు వచ్చామన్నారు. మంగళవారం ఆయన నగరంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేసినా ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారన్నారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉంటూ మచ్చలేని నేతగా పేరొందిన జీవన్‌రెడ్డి అభ్యర్ధి కావడం ప్లస్ పాయింట్ అయిందన్నారు.
ఎన్నికల్లో తమకు సహకారం అందించిన వామపక్ష పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. కార్యకర్తలు తామే అభ్యర్థులుగా భావించి జీవన్‌రెడ్డి గెలుపు కోసం కష్టపడ్డారని వారి శ్రమకు ఫలితం లభించిందన్నారు. మతసామరస్యాన్ని చాటిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర భారత్‌లో బీజేపీ ఉనికి కోల్పోయిందని డబుల్ఇంజిన్ సర్కార్ వారికి సాధ్యం కాదన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, డి.రాజేశ్వర్, అరికెల నర్సారెడ్డి, ముత్యాల సునీల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.