రాజగోపాల్ రెడ్డి దొంగ మాటలు చెబుతున్నాడని మంత్రి తలసాని మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల్లో మెజార్టీతో గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఆదరిస్తున్నారన్న ఆయన... బీజేపీ, కాంగ్రెస్ లు కుళ్లు, కుతంత్రాలతో అమలు చేయలేని హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. అన్నీ గాలి మాటలని, దుబ్బాకలో గెలిచిన తర్వాత ఒక్క పైసా తేలేదని విమర్శించారు. గొల్ల, కురుమలు అడగక ముందే13 వేల కోట్లు ఖర్చు చేసి గొర్రెల పంపిణీ చేపట్టామని తెలిపారు. దీని వల్ల 50శాతం మంది లబ్ధి చేకూరిందని చెప్పారు.
కరోనా నేపథ్యంలో సీఎం యూనిట్ కాస్ట్ పెంచారని తలసాని అన్నారు. యాదాద్రిలో ఎన్నికల షెడ్యూల్ రాక ముందే.. ఆ స్కీం ఆపేశారని, ఎన్నికల తర్వాత కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సెకండ్ ఫేజ్ లో నిధులు రెడీగా ఉన్నాయన్న ఆయన... చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 119 ఎమ్మెల్యేలలో బీజేపీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలేనని, 3 వేల పెన్షన్లు ఎక్కడినుంచి ఇస్తారని ప్రశ్నించారు.