Champions Trophy: మేమే గెలిచాం..: ట్రోలర్లపై పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ జోకులు

Champions Trophy: మేమే గెలిచాం..: ట్రోలర్లపై పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ జోకులు

దాదాపు 15 ఏళ్ల పాటు అంతర్జాతీయ సిరీస్‌లకు ఆతిథ్యమివ్వకపోవటంతో పాకిస్థాన్‌లో క్రికెట్ స్టేడియంలు అధ్వాన్న స్థితికి చేరాయి. గోడలకు పగుళ్లు, పాడైపోయిన స్క్రీన్లు, విరిగిపోయిన కుర్చీలు, అరకోర కుర్చీలు బాగున్నా వాటిపై పిట్టల రెట్టలు.. ఇదీ మూణ్ణెల్ల క్రితం అక్కడి పరిస్థితి. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తుండటంతో ఐసీసీ ఇచ్చిన డబ్బులతో పునరుద్ధరణ పనులు మొదలు పెట్టారు. అయితే, సకాలంలో ఆ పనులు పూర్తి చేయకపోవచ్చన్న విమర్శలొచ్చాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి నెల రోజుల ముందువరకు స్టేడియంల పునరుద్ధరణ పనులు నత్తనడకన సాగాయి. దాంతో, టోర్నీని మరో వారం రోజులు ముందుకు జరపాల్సి రావొచ్చు అన్న టాక్ నడిచింది. అదే జరిగితే, పాక్ క్రికెట్ బోర్డు ప్రపంచం ముందు తలదించుకోక తప్పదని ట్రోల్స్ వచ్చాయి. దాంతో, అప్రమత్తమైన పీసీబీ చైర్మన్ నఖ్వీ.. దగ్గరుండి మరీ పనులు పూర్తి చేపించారు. మంగళవారం(ఫిబ్రవరి ) కొత్తగా పునరుద్ధరించబడిన కరాచీ స్టేడియంను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన నఖ్వీ.. పీసీబీ పునరుద్ధరణ పనులను సకాలంలో పూర్తి చేయలేకపోతుందని ట్రోల్ చేసిన నెటిజన్లను తప్పుబట్టారు. అనుకున్న సమయానికి పనులు పూర్తవ్వడంతో ట్రోలర్లపై జోకులు పేల్చారు.
  
"మేము గెలిచాము, మీరు ఓడిపోయారు. స్టేడియం నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయలేయమని సోషల్ మీడియాలో విమర్శించిన వారికోసమే ఈ మాటలు. మేము దీన్ని పూర్తి చేయడంలో విఫలమయ్యుంటే.. మీరు గెలిచి ఉండేవారు. ఇప్పుడు మేం పూర్తి చేశాం.. అంటే, మీరు ఓడిపోయారు.." అని జియో న్యూస్ తో నఖ్వీ అన్నారు.

స్టేడియం పునరుద్ధరణ పనుల కోసం శ్రమించిన కార్మికులకు నఖ్వీ కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో పనులు పూర్తి చేసి పాక్ పౌరుల సత్తాను, అంకిత భావాన్ని చూపించారని కొనియాడారు. 

ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది.