ఆయుధాల తయారీ మరెప్పుడో!

ఆయుధాల తయారీ  మరెప్పుడో!

ఇండియాని గ్లోబల్ డిజైన్,​ మ్యానుఫ్యాక్చరింగ్​ హబ్​లా మార్చటానికి మోడీ సర్కారు మేకిన్​ ఇండియా ప్రోగ్రామ్​ని 2014లో ప్రారంభించింది. పాతిక రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలనుకుంది. ఇందులో డిఫెన్స్​ మ్యానుఫ్యాక్చరింగ్​ సెక్టార్​ కూడా ఉంది. రక్షణ రంగంలో వాడుకునే ప్రతి వస్తువునూ మన దేశంలోనే తయారుచేసుకోవటం, దీనికోసం ఇన్వెస్ట్​మెంట్లను ఆకర్షించడం, యూత్​కి ఉద్యోగాలు కల్పించటం వంటి లక్ష్యాలు పెట్టుకుంది. కానీ… రెండేళ్లుగా ఆరు మేజర్​ ప్రాజెక్టులు అసలు ఆరంభమే కాలేదు.

డిఫెన్స్​పై ఎక్కువ ఖర్చు పెడుతున్న దేశాల లిస్టులో ఇండియా ఐదో స్థానంలో ఉంది. అతి పెద్ద ఆర్మీ గల రెండో దేశం కూడా మనదే. మన దేశ రక్షణ రంగంలో వాడుతున్న ఎక్విప్​మెంట్లలో 50 శాతానికి పైగా విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. అయిదేళ్ల క్రితం ‘ఇండియాలో పెట్టుబడులు పెట్టాలా? వద్దా?’ అని గ్లోబల్​ ఇన్వెస్టర్లు అనుమానాలతో వెనకాముందు ఆడుతున్న పరిస్థితుల్లో ప్రధాని మోడీ ‘మేకిన్​ ఇండియా’ ప్రాజెక్టు తెచ్చారు. సెక్యూరిటీ ఫోర్స్​ని మోడ్రన్​ బాట పట్టించాలనే ఆలోచన కూడా ఈ ప్రాజెక్టుకి దారితీసింది.

డిఫెన్స్​ సెక్టార్​లోకి ప్రైవేట్​ పెట్టుబడులకు తలుపులు తెరవటం వల్ల..  ఎక్విప్​మెంట్​ తయారు చేస్తున్న విదేశీ​​ కంపెనీలు ఇండియన్​ కంపెనీలతో స్ట్రాటజిక్​ పార్ట్నర్​షిప్(ఎస్పీ)ల​ను ఏర్పాటు చేసుకుంటాయి. తద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లను ఇండియా కూడా ప్రభావితం చేస్తుంది. రక్షణ పరికరాల కోసం ఇన్నాళ్లూ ఇంపోర్ట్​లపైనే ఆధారపడ్డ మన దేశం.. భవిష్యత్​లో వాటిని ఎక్స్​పోర్ట్​ చేయగలిగే స్థితికి చేరుతుంది. ఇందులో భాగంగా 2016, 2018ల్లో సుమారు 556 కోట్ల డాలర్ల విలువైన 21 డిఫెన్స్​ ఆఫ్​సెట్​ కాంట్రాక్ట్​లపై సంతకాలు జరిగాయి.

కీలక చర్యలు చేపట్టిన కేంద్రం

మన దేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీని ఎంకరేజ్​ చేయటానికి కేంద్రం ఇప్పటికే కీలక చర్యలు చేపట్టింది. డిఫెన్స్​ ప్రొక్యూర్​మెంట్​ ప్రొసీజర్(డీపీపీ), ఫారిన్​ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్(ఎఫ్​డీఐ) పాలసీలని మార్చింది.​ ఇతర ప్రొసీజర్లను, ఆఫ్​సెట్​ గైడ్​లైన్స్​ని కూడా సింప్లిఫై చేసింది. స్ట్రాటజిక్​ పార్ట్నర్​షిప్​(ఎస్పీ) మోడల్​కి నోటిఫికేషన్​ జారీ చేసింది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్​లలో డిఫెన్స్​ ఇండస్ట్రియల్​ కారిడార్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ గ్రౌండ్​ లెవల్​లో అమలుకావటానికి సమయం పట్టేట్లు ఉందని ఓ సీనియర్​ ఆఫీసర్​ చెప్పారు.

ఆలస్యానికి కారణాలు..

ప్రొసీజర్లను సింప్లిఫై చేశామని ప్రభుత్వం చెబుతున్నా అమల్లో ఎక్కడా లేవని ఎక్స్​పర్ట్​లు అంటున్నారు. బ్యూరోక్రసీ ఆటంకాలు, అనుమతుల మంజూరులో ఆలస్యం వల్లే ప్రాజెక్టులు ప్రారంభం కావడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. లేటవుతున్న ప్రాజెక్టుల లిస్టులో రష్యా సహకారంతో తయారు చేయాల్సిన 200 మల్టీపర్పస్​ హెలికాప్టర్లు(కెమోవ్​ కేఏ–226టీ లైట్​) కూడా ఉన్నాయి. ఆర్మీ, ఎయిర్​ఫోర్స్​ల్లోని చేతక్​ హెలికాప్టర్ల స్థానంలో వీటిని ప్రవేశపెడతారు.

అలాగే, 56సీ–295 ఎయిర్​క్రాఫ్ట్​లను రూపొందించే టాటా–ఎయిర్​బస్​ ప్రాజెక్టు విషయంలో ధరలకు సంబంధించిన చర్చలు కొలిక్కి రావటానికి ఎక్కువ సమయం పట్టింది. ఈ సింగిల్​ వెండార్​ ప్రాజెక్టుకు క్లియరెన్స్​ ఇచ్చే అంశం ఇప్పుడు ‘కేబినెట్​ కమిటీ ఆన్​ సెక్యూరిటీ’ వద్ద ఉంది. గ్లోబల్​ ఆర్మమెంట్​ సంస్థలతో కలిసి న్యూ జనరేషన్​ వెపన్​ సిస్టమ్స్​ తయారుచేయటంలో మన కంపెనీల పాత్రను పెంచే స్ట్రాటజిక్​ పార్ట్నర్​షిప్(ఎస్పీ) మోడల్ వల్ల కూడా ప్రాజెక్టులు పట్టాలెక్కటంలో ఆలస్యం జరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు.

తననూ పరిగణనలోకి తీసుకోవాలన్న హెచ్​ఏఎల్​

స్ట్రాటజిక్​ పార్ట్నర్​షిప్​ మోడల్​ అమల్లో భాగంగా​ నాలుగు ఇండియా కంపెనీలను(టాటా, అదానీ, మహింద్రా డిఫెన్స్​, భారత్​ ఫోర్జ్​లను), మూడు ఫారిన్​ సంస్థలను(ఎయిర్​బస్​, కమోవ్​, లాక్​హీడ్​ మార్టిన్​–సికోర్​ స్కైలను) షార్ట్​ లిస్ట్​ చేశారు. ప్రభుత్వ రంగానికి చెందిన డిఫెన్స్​ ఎక్విప్​మెంట్​ తయారీ సంస్థ హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​(హెచ్​ఏఎల్​) తమను కూడా ఈ షార్ట్​ లిస్టులో చేర్చాల్సిందిగా డిఫెన్స్​ మినిస్ట్రీని కోరింది. హెచ్​ఏఎల్​ తయారుచేసే ఛాపర్లను స్ట్రాటజిక్​ పార్ట్నర్​షిప్​ మోడల్​ కింద తీసుకోవాలని చెబుతోంది.

ఎస్పీ మోడల్​ కింద నేవీ కోసం 6 కొత్త స్టీల్త్​ డీజిల్​–ఎలక్ట్రిక్​ సబ్​ మెరైన్స్​ని తయారుచేసే ప్రాజెక్టు తొలిసారిగా 2007 నవంబర్​లో ఆమోదం పొందింది. ఈ డీల్​ విలువ అప్పట్లోనే రూ.50 వేల కోట్లు. అది ఇన్నాళ్లకు ఫైనల్ దశ​కి చేరింది. సర్వీసులో సమస్యలు వస్తున్న, కుప్పకూలే ప్రమాదం ఎక్కువగా ఉన్న సింగిల్​ ఇంజన్​ చీతా, చేతక్​ ఫ్లీట్ల స్థానంలో విదేశీ టూ–ఇంజన్​ లైట్​ యుటిలిటీ ఛాపర్లు ఇవ్వాలని ఆర్మ్​డ్​ ఫోర్స్​లు 15 ఏళ్లుగా కోరుతున్నాయి. కానీ, ఆ ఒప్పందాలు టెక్నికల్​ ప్రాబ్లమ్స్​, అవినీతి ఆరోపణలతో పదేళ్లలోనే మూడుసార్లు రద్దయ్యాయి.

పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులేంటి?

డిఫెన్స్​ మ్యానుఫాక్చరింగ్​కి సంబంధించిన ఆరు మేజర్​ ప్రాజెక్టులు 2017  నుంచి ‘ఎక్కడ వేసినవి అక్కడే’ మాదిరిగా ఉన్నాయి. అవి.. 1) న్యూజనరేషన్​ స్టీల్త్​ సబ్​మెరైన్స్​. 2) మైన్​ స్వీపర్స్​. 3) లైట్​ యుటిలిటీ హెలికాప్టర్లు. 4) ఇన్​ఫాంట్రీ కంబాట్​ వెహికిల్స్​. 5) ట్రాన్స్​పోర్ట్​ ఎయిర్​క్రాఫ్ట్.​ 6) ఫైటర్​ జెట్లు.

వీటన్నింటి కన్నా ముందు.. రష్యాతో కలిసి కలాష్నికోవ్​ ఏకే 203 అసాల్ట్​ రైఫిళ్ల తయారీ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. యూపీలోని అమేథీ పరిధిలోకి వచ్చే కోర్వా ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీలో 7.45 లక్షల రైఫిళ్లను తయారుచేయనున్నారు. దీనికోసం కేంద్రం రూ.12 వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఈ రైఫిళ్లు ఏకే 47 గన్నుల కన్నా పవర్​ఫుల్​. ఇవి 300 మీటర్ల దూరంలోని టార్గెట్​ని కూడా మట్టుబెడతాయి. కోర్వా ఫ్యాక్టరీలో తయారయ్యే 7.45 లక్షల రైఫిళ్లలో 7 లక్షల రైఫిళ్లను ఆర్మీకి; 29 వేల రైఫిళ్లను ఎయిర్​ఫోర్స్​కి; 13,600 రైఫిళ్లను నేవీకి అందించనున్నారు. దీనికి సంబంధించి రష్యాతో ఫైనల్​ కాంట్రాక్ట్​ను వచ్చే ఏడాది ఆరంభంలో కుదుర్చుకోనున్నారు. బడ్జెట్​ పరిమితులవల్ల ఈ ఆధునిక​ రైఫిళ్లను కొద్దిమందికే ఇస్తామని ఆర్మీ జనరల్​ బిపిన్​ రావత్​ ఈ మధ్య మీడియాతో చెప్పారు.