AP Assembly Sessions: పసుపు రంగు దుస్తుల్లో అసెంబ్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు..!

AP Assembly Sessions: పసుపు రంగు దుస్తుల్లో అసెంబ్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు..!

అమరావతి : పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీఎల్పీ సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున్నందున మరో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనునట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ పాలనపై ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ముందు ఉంచిన సంగతి తెలిసిందే. శాంతిభద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల శ్వేతపత్రాలపై సభలోనే చర్చ పెట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం ఉదయం 8.30 గంటలకు వెంకటపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తారు.