
స్కిన్ ఫిట్ టాప్స్.. ఒంటికి అతుక్కుపోయే జీన్స్, లెగ్గింగ్స్, జెగ్గింగ్స్.. ఇవే లేటెస్ట్ ట్రెండ్ ఇప్పుడు. కానీ, అతిగా తింటే తీపి అయినా వెగటే అన్నట్లు..ఈ స్కిన్ టైట్ డ్రెస్లు ఎక్కువగా వేసుకుంటే చేజేతులా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్టే. ఒక్క స్కిన్ టైట్ టాప్‌లు, జీన్స్లే కాదు బిగుతుగా ఉండే లోదుస్తులు కూడా డేంజరే.. ఇదే విషయాన్ని జర్మనీలోని ఫేమస్ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇవో గ్రీబ్ కూడా చెప్తున్నాడు. ఆయన స్టడీలో తేలిన విషయాలివి..
ఇరవైయ్యవ శతాబ్దం వరకు వెస్ట్రన్ వరల్డ్‌లో టైట్ బట్టలు కోర్సెట్ రూపం తీసుకున్నాయి. టైట్ లేస్తో తయారయ్యే వీటివల్ల నడుము భాగం సన్నగా కనిపించేది.. దాంతో చాలామంది వార్డ్‌రోబ్‌లో వీటికి చోటిచ్చారు. కానీ, బిగుతుగా ఉండే కోర్సెట్ ఎక్కువగా వేసుకోవడం వల్ల ఊపిరితిత్తులు, కడుపు, పేగులు ఎఫెక్ట్ అయ్యేవి.. అవి కొన్నిసార్లు సర్జరీలకి కూడా దారితీసేవి. అయితే ఇప్పుడున్న టైట్ జీన్స్‌లు, టాప్‌లు కోర్సెట్స్ వాటంత హాని చేయకపోయినా.. ఇవి తెచ్చే ఆరోగ్య సమస్యల్ని చూసీచూడనట్టు వదిలేయడానికి లేదు అంటున్నారు ఇవో గ్రీబ్. అంతేకాదు వీటివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్‌ని కూడా చెప్తున్నారాయన.
బిగుతు బట్టలు వేసుకున్నప్పుడు ఫ్రీగా ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఒంటికి అతుక్కుపోయే టాప్‌లు, బ్రాలు వేసుకున్నప్పుడు ఛాతీపై ఒత్తిడి పడుతుంది. ఛాతి ఫ్రీగా కదల్లేదు కూడా. దాంతో గుండె, ఊపిరితిత్తుల్లో సన్నటి నొప్పి మొదలవుతుంది. బ్రెయిన్‌కి సరిపడా ఆక్సిజన్ అందక ఏకాగ్రత తగ్గుతుంది. తలనొప్పి లాంటి సమస్యలు చుట్టుముడతాయి.
టైట్ జీన్స్‌లు వేసుకున్నప్పుడు ఫ్రీగా కాళ్లు ముడుచుకొని కూర్చోలేరు.. పైగా నడుము దగ్గర బిగుతుగా ఉండటం వల్ల నిటారుగా కూర్చోలేం. దానివల్ల వెన్ను, కండరాల నొప్పులు వస్తాయి.
టైట్ బట్టల వల్ల శరీరానికి సరిపడా గాలి అందక ఒంట్లో వేడి పెరుగుతుంది. అలాగే బిగుతుగా ఉండే జీన్స్, లెగ్గింగ్స్ వల్ల గుండె నుంచి కాళ్ల వరకు రక్తం బాగానే వెళ్లిపోతుంది. కానీ తిరిగి గుండెకు చేరేటప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. కొన్నిసార్లు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవచ్చు కూడా. దానివల్ల కాళ్లు చచ్చుబడిపోవడం, పాదాల వాపు లాంటి సమస్యలు వస్తాయి.
నడుము నుంచి మోకాలి కింద వరకూ బిగుతుగా ఉండి, వెనక వైపు చిన్న స్లిట్ ఉండే పెన్సిల్ కట్ స్కర్ట్ వల్ల కూడా ఇబ్బందులు తప్పవు. ఇలాంటి స్కర్ట్ వేసుకుంటే మామూలుగా వేసే అడుగుల దూరం 10 నుంచి 15 శాతం తగ్గుతుంది. అంటే కాళ్లను వీలైనంత ముందుకు చాపి నడిచే వీలు లేక, చిన్న చిన్న అడుగులేస్తారు. దానివల్ల కాలి కండరాలు ఎఫెక్ట్ అయ్యి ముందుముందు నడక వేగం తగ్గుతుంది.
స్కిన్ టైట్ బట్టలు ఇన్ఫెర్టిలిటీకి కూడా కారణం అవుతాయి. మగవాళ్లు బిగుతు జీన్స్‌లు వేసుకోవడం వల్ల శరీరంలో వేడి ఎక్కువై స్పర్మ్ దెబ్బతింటుంది. ఆడవాళ్లకు వజైనాలోని పీహెచ్ ఇంబాలెన్స్ అవుతుంది. దాంతో ఈస్ట్, క్యాండిడా లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇవి కూడా ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తాయి.
బిగుతు బట్టల వల్ల చర్మంపై గీతలు పడతాయి. స్కిన్ ఇరిటేషన్ కూడా ఇబ్బంది పెట్టొచ్చు. అలాగే టైట్ జీన్స్ వల్ల పొత్తి కడుపు ఒత్తుకుపోయి నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే బిగుతు బట్టలంటే ఎంత ఇష్టం ఉన్నా అదే పనిగా వేసుకోవడం మానేయాలి.