
- వరికి నీరు అందక పశువులు, జీవాలకు చేనులను వదిలేస్తున్న రైతులు
- పెట్టుబడి రాని పరిస్థితి
మహబూబ్నగర్, వెలుగు : వాతావరణంలో వచ్చిన మార్పులతో ఈ ఏడాది పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే లో టెంపరేచర్లతో పల్లీ పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో వరి రైతులు అల్లాడిపోతున్నారు. ఈ యాసంగిలో వరి వేసిన రైతులు వాటిని కాపాడుకోలేక అరిగోస పడుతున్నారు. పంటలు సాగు చేసేందుకు వేలల్లో పెట్టుబడులు పెట్టి, ప్రకృతి కరుణించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలను కాపాడుకోలేని పరిస్థితి లేక కొందరు చేసేది లేక చేనులను పశువులు, జీవాలకు వదిలిపెడుతున్నారు.
వాతావరణంలో తీవ్ర మార్పులు
ఈ ఏడాది మొదటి నుంచి వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జూన్, జులైలో వర్షాలు కురవాల్సి ఉండగా.. ఆలస్యంగా ఆగస్టు నెల నుంచి ప్రారంభం అయ్యాయి. సెప్టెంబరు, అక్టోబరు వరకు ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత వాన జాడ లే
దు. మహారాష్ర్ట, కర్నాటక రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురవడంతో అక్కడి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో వరద చేరింది. దీంతో దిగువన ఉన్న జూరాలకు.. అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ మొత్తంలో వరద చేసింది. ఈ రెండు ప్రాజెక్టులు ఫుల్ కెపాసిటీకి చేరుకోవడంతో.. వీటి పరిధిలో ఉన్న లిఫ్టులు, చెరువులకు ఆఫీసర్లు నీళ్లు మళ్లించారు. దీంతో అవి కూడా నిండు కుండను తలపించాయి. దాదాపు రెండేళ్ల నుంచి నోర్లు ఎల్లబెట్టిన చెరువులకు కూడా నీరు చేరాయి. అయితే నవంబరు నుంచి పరిస్థితులు మారిపోయాయి. రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు పడిపోవడం.. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటలపై ఎఫెక్ట్ చూపాయి.
మూడు నెలల కిందట ఆగమైన పల్లి రైతులు
వానాకాలంలో సాగు చేసిన పత్తి, కంది పంటలు దెబ్బతినడంతో యాసంగిలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రైతులు పల్లి సాగు చేపట్టారు. ఈ సీజన్లో పల్లి సాధారణ విస్తీర్ణం 1.60 ఎకరాలకు గాను.. రికార్డు స్థాయిలో దాదాపు 2.20 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. పంట చేతికొచ్చాక జనవరిలో వేరుశనగ మొక్కలు పీకి చూస్తే దంట్లు మొత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి.
ఒక ఊడకు 18 నుంచి 20 బుడ్డలు కాయాల్సి ఉంగడా.. కనీసం ఐదారు కూడా లేవు. ఎకరాకు 25 సంచుల నుంచి 30 సంచుల వరకు దిగుబడి రావాల్సి ఉండగా.. పది నుంచి 12 సంచులకు మించి పంట చేతికి రాలేదు. పూత పట్టి కాయపడుతున్న సమయంలో లో టెంపరేచర్లు నమోదు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు స్పష్టం చేశారు. లో టెంపరేచర్ల వల్ల వేరుశనగ వేర్లు భూమి లోపలికి పోలేక ఊడలకు వైరస్ సోకి, న్యూట్రియంట్ లోపం ఏర్పడటంతో పంటకు చీడపీడలు ఆశించాయి. దీంతో దిగుబడి తగ్గిపోయింది. పంట సాగు చేసిన రైతులకు కనీసం పెట్టుబడులు కూడా చేతికి రాకా తీవ్రంగా నష్టపోయారు.
రెండు నెలలుగా విపరీతమైన ఎండలు..
నీరు పుష్కలంగా ఉండటం.. గ్రౌండ్ వాటర్ కూడా పెరగడంతో ఈ యాసంగిలో రైతులు పెద్ద మొత్తంలో వరి సాగు చేపట్టారు. అయితే జనవరి చివరి వారం నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు కేవలం లో టెంపరేచర్లు మాత్రమే నమోదు కాగా.. ఆ నెల చివరి వారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫిబ్రవరిలో పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 36 డిగ్రీలకు పెరిగిపోయాయి. దీంతో వరి పంటలను కాపాడుకోవడానికి రైతులు బోరు మోటార్లను ఎక్కువగా వినియోగించారు. అప్పటి వరకు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లలోపు ఉన్న గ్రౌండ్ వాటర్ ఏకంగా ఏడు మీటర్ల నుంచి తొమ్మిది మీటర్ల లోపలికి పడిపోయింది.
బోర్ల వినియోగం కూడా విపరీతంగా పెరగడంతో మోటార్లు నీటిని ఆపి ఆపి పోస్తున్నాయి. కొన్ని చోట్ల గ్రౌండ్ వాటర్ పాతాళానికి పడిపోవడంతో రైతులు పంటలను కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మద్దూరు, గండీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో రైతుల వరి చేనులను పశువులు, గొర్లు, మేకలకు వదిలేశారు. చిన్నచింతకుంట, మాగనూరు తదితర మండలాల్లో సాగునీరు అందక వరి పొలాలు నెర్రలు బారాయి. దీంతో రైతులు ఆ పొలాలను కూడా వదిలేశారు. పంట చేతికి రాక ముందే నష్టపోయారు. కెనాల్స్ కింద పంటలు సాగు చేసిన రైతులు చివరి తడుల వరకు నీటిని అందించి, రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. మరికొందరు రైతులు మోటార్లను కెనాల్స్లోకి దింపి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.