హైదరాబాద్​లో కుండపోత.. మరో 5 రోజులు వర్షాలు

హైదరాబాద్​లో  కుండపోత.. మరో 5 రోజులు వర్షాలు
  • రోడ్లన్నీ జలమయం.. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్
  • పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లు 
  • కొన్నిచోట్ల వరదలో మునిగిన వాహనాలు
  • జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • అత్యధికంగా నాగర్​కర్నూల్​ జిల్లా 
  • వెల్దండలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం
  • పిడుగులు పడి సిరిసిల్లలో ఇద్దరు, 
  • రంగారెడ్డి జిల్లాలో ఒకరు మృతి  
  • మరో ఐదు రోజులు వానలు..అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్/నెట్ వర్క్, వెలుగు : హైదరాబాద్​ను వర్షం ముంచెత్తింది. గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో రెండున్నర గంటల పాటు కుండపోత కురిసింది. భారీ వర్షానికి రోడ్లపై పెద్ద ఎత్తున వరద చేరి, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండలో 9.8 సెంటీమీటర్లు, హైదరాబాద్ లోని కృష్ణానగర్​లో 9.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ మండిపోయింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అరగంట వ్యవధిలో మబ్బులు కమ్ముకుని ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల వరకు దాదాపు రెండున్నర గంటల పాటు సిటీ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. 

దీంతో అటు కాలనీల్లో, ఇటు రోడ్లపైనా వరద చేరింది. ఓవైపు వరద, మరోవైపు వర్షంతో రోడ్లపై గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన రాజ్​భవన్​రోడ్, పబ్లిక్​గార్డెన్, అసెంబ్లీ, లక్డీకాపూల్, మాసబ్​ట్యాంక్, అమీర్​పేట, కూకట్​పల్లి, ఐటీ కారిడార్ తదితర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రం ఇంటికి వెళ్తున్న ఉద్యోగులందరూ ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడ్డారు.  

బంజారాహిల్స్​లో కూలిన నాలా పైకప్పు.. 

భారీ వర్షానికి ఐటీ కారిడార్ ఆగమైంది. మాదాపూర్, కొండాపూర్, నానక్​రామ్​గూడ, మైండ్​స్పేస్ నుంచి నెక్టార్​ వైపు భారీగా వరద చేరి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ వెళ్లే దారిలో నీళ్లు నిలిచి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. కొండాపూర్ నుంచి హఫీజ్ పేట వైపు వెళ్లే దారిలో ఆర్టీఏ ఎదురుగా మోకాళ్ల లోతు నీళ్లు నిలవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. బంజారాహిల్స్​లోని ఉదయ్​నగర్ కాలనీలో నాలా పైకప్పు కూలిపోవడంతో వరద ఇండ్లలోకి వచ్చింది. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిపివేశారు. ప్రజాభవన్ వద్ద ఫ్లైఓవర్ పై దాదాపు గంటసేపు ట్రాఫిక్​ నిలిచిపోయింది. హిమాయత్​నగర్​ రోడ్ ​నెం.15లో చెట్టు కూలి విద్యుత్​సరఫరాకు అంతరాయం కలిగింది. గాంధీనగర్, నిమ్స్​సమీపంలోనూ కరెంట్ కట్ అయింది. కొన్ని ప్రాంతాల్లో నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి. పలు ప్రాంతాల్లో వరద నీటిలో వాహనాలు మునిగిపోయాయి. కాగా, వర్షం కారణంగా నేషనల్ హైవేలపైనా రాకపోకలకు అంతరాయం కలిగింది. విజయవాడ జాతీయ రహదారిపై చింతలకుంట వద్ద దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్​జామ్ అయింది. అలాగే రాజీవ్ రహదారిలో కూడా గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక చాదర్​ఘాట్​వద్ద భారీగా వరద చేరడంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ​జామ్​ అయింది. డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ సిబ్బంది రంగంలోకి దిగి వరద నీటిని, కూలిన చెట్లను తొలగించారు.  

జిల్లాల్లోనూ భారీ వర్షాలు.. 

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ గురువారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నాగర్​కర్నూల్, మహబూబ్​నగర్, సూర్యాపేట జిల్లాల్లో పలు చోట్ల పెద్ద వానలు పడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ వర్షాల ప్రభావం ఉంది. అత్యధికంగా నాగర్​కర్నూల్​జిల్లా వెల్దండలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో 6.7, మహబూబ్​నగర్​లోని అడ్డకాల్​లో 6.6, మెదక్​లోని రామాయంపేటలో 5.8, నల్గొండలోని నాంపల్లిలో 5.4, వరంగల్ లోని గొర్రెకుంటలో 5.1, సిద్దిపేటలోని కొండపాకలో 5, నల్గొండలోని చింతపల్లిలో 4.8, జనగామలో 4.4, వరంగల్​లోని కాశీబుగ్గలో 4.2, కరీంనగర్​లోని నుస్తులాపూర్​లో 3.8, నాగర్​కర్నూల్​లోని ఊర్కొండలో 3.7, వనపర్తిలోని సోలీపూర్​లో 3.7, హనుమకొండలోని ఐనవోలులో 3.7, మెదక్ లోని మాసాయిపేటలో 3.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు.. 

ఉమ్మడి వరంగల్‍ జిల్లావ్యాప్తంగా జోరువాన కురిసింది. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. వరంగల్‍, హనుమకొండ, జనగామ జిల్లాలతో పాటు మహబూబాబాద్‍ జిల్లా బయ్యారం, నెల్లికుదుర్ల, కొత్తగూడ, గంగారం, మహబూబాబాద్‍, మరిపెడ మండలాల్లోని పలు గ్రామాల్లో కరెంట్‍ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిసిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినిపల్లి–కొదురుపాక రోడ్డుపై దేశాయిపల్లి వద్ద చెట్లు కూలాయి.  కరెంట్‌‌‌‌ పోల్‌‌‌‌ విరగడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మెదక్ జిల్లా రామాయంపేటలో కుండపోత వర్షం కురిసింది. నిజాంపేట్, కోల్చారం, పాపన్నపేట మండలాల్లో భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిసిపోయాయి. పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో  భారీ వర్షాలు పడి చాలాచోట్ల ధాన్యం తడిసిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా లాల్ టేకిడి గ్రామంలో కొన్ని ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. సిరిసిల్ల పట్టణం,  కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి,  బీబీపేట మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. 

మొదట్లో మంటలు.. ఇప్పుడు కూల్ 

నిజానికి మార్చి ఆరంభం నుంచే ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఆ నెలలోనే టెంపరేచర్లు 42 డిగ్రీల మార్క్​ను దాటేశాయి. దీంతో ఈసారి మేలో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయన్న ఆందోళనలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టే మే తొలి వారంలో ఉష్ణోగ్రతలు రికార్డ్​స్థాయిలో నమోదయ్యాయి. పలు జిల్లాల్లో 47 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు రికార్డ్​ అయ్యాయి. సగటున రాష్ట్రవ్యాప్తంగా 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. అయితే రెండో వారం నుంచి పరిస్థితి మారింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాష్ట్రానికి ఆనుకుని వరుస ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతుండడంతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రస్తుతం టెంపరేచర్లు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు 42 డిగ్రీలకన్నా తక్కువగానే టెంపరేచర్లు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గురువారం అత్యధికంగా ఆదిలాబాద్​ జిల్లాలో 41.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవగా.. మిగతా చోట్ల 40 డిగ్రీలు, ఆలోపే రికార్డయ్యాయి. హైదరాబాద్​లోని టోలిచౌకిలో అత్యల్పంగా 37.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.

అలర్ట్​గా ఉండండి :  సీఎం రేవంత్ 

హైదరాబాద్​తో పాటు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. గురువారం సెక్రటేరియెట్ నుంచి అన్ని విభాగాల అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

ఇంకో 5 రోజులు వానలు.. 

మరో ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.