- పాలమూరు జిల్లాలో ఎదుగుదల లేని పంటలు
- దిగుబడిపై ప్రభావం చూపుతుందని ఆందోళన
మహబూబ్ నగర్, వెలుగు: వరి పంటగిడసబారుతోంది. నాట్లు వేసి నెల రోజులు కావస్తున్నా ఇంత వరకు పైర్లు పెరగడం లేదు. ఓ వైపు సాగునీరు లేక పంటలను కాపాడుకోవడానికి తిప్పలు పడుతుండగా, ఇప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పులు వరిపై ప్రభావం చూపుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా ఎన్నడూ లేనంతగా తెల్లవారుజాము సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది.
మంచు కూడా కురుస్తుండడంతో ఆ ప్రభావం వరి పంటపై పడుతోంది. దీంతో వరి పంటలు ఎదగడం లేదు. చేలు గిడసబారి కనిపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే పంట దిగుబడులపై ఎఫెక్ట్ పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఒక్కో మొక్కకు 40 నుంచి 50 పిలకలు రావాల్సి ఉండగా, మొక్కలు గిడసబారిపోవడంతో ఒక్కో మొక్కకు ఐదు నుంచి పది పిలకలు కూడా వచ్చే అవకాశం ఉండదు. దీంతో ఎకరాకు 10 నుంచి 15 బస్తాల దిగుబడి మాత్రమే వచ్చే చాన్స్ ఉంది.
తగ్గిన సాగు..
ఈ ఏడాది మార్కెట్లో బియ్యానికి డిమాండ్ బాగా పెరిగింది. బియ్యం రకాన్ని బట్టి క్వింటాల్ కు రూ.5 వేల నుంచి రూ.6,500 వరకు అమ్ముడవుతున్నాయి. దీంతో రైస్ మిల్లర్లు, బియ్యం వ్యాపారులు గత వానాకాలం సీజన్లో పచ్చి వడ్లను కూడా ఎక్కువ రేటుకు కొన్నారు. ఈ క్రమంలో యాసంగి వరి సాగు గణనీయంగా పెరుగుతుందని అందరూ భావించారు. కానీ, అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. ఈ సీజన్లో వరి సాగు సాధారణ విస్తీర్ణం 1.20 లక్షలుగా అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. ఏటా దాదాపు లక్ష ఎకరాలకుపైగానే వరి సాగయ్యేది. ఈ సీజన్లో మాత్రం ఇప్పటి వరకు 60 వేల ఎకరాల లోపే వరి సాగులో ఉంది. మరికొందరు రైతులు ఇప్పుడిప్పుడే వరి నాట్లు వేస్తున్నారు. ఈ లెక్కన 70 వేల ఎకరాల్లోపే వరి సాగయ్యే అవకాశం ఉంది.
బోర్లే ఆధారం..
తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది జిల్లాలో చెరువులు, కుంటలు నిండలేదు. గత వానాకాలం సీజన్లో వరి సాగు చేసిన రైతులు పంటలు కాపాడుకోవడానికి బోర్లను విపరీతంగా వినియోగించారు. దీంతో డిసెంబరు నెలలోనే భూగర్భజలాలు అడుగంటిపోయాయి. చాలా బోర్లు రీచార్జ్ కాలేదు. దీంతో వరి సాగు చేపట్టిన రైతులు కొత్తగా బోర్లు వేయిస్తున్నారు. కాల్వల ద్వారా కూడా సాగునీరు అందుబాటులో లేకపోవడంతో బోర్లను డ్రిల్ చేయడంపైనే దృష్టి పెట్టారు. దీనికితోడు ప్రస్తుతం సాగులో ఉన్న వరికి మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు నీటి తడులు అందించాల్సిన అవసరం ఉండడంతో బోర్లనే నమ్ముకుంటున్నారు.
ఉష్ణోగ్రతలు తగ్గడంతోనే..
పగటి ఉష్ణోగ్రత్తలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. అందు వల్ల వరి పైర్లు ఎదగడం లేదు. డీఏపీ ఎక్కువగా వాడితే కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. వరి పొలాల్లో నిల్వ చేసిన నీటిని రోజూ మార్చాలి. సాగునీటి సమస్య ఉంటే కనీసం మూడు రోజులకోసారి నీటిని మార్చాలి. లేకుంటే నీళ్లు నల్లగా మారి చల్లబడతాయి. చలికి తోడు నీళ్లు చల్లగా ఉండడంతో వరి మొక్కలు గిడసబారిపోతాయి. పంట ఎదగాలంటే ఎకరాకు 15 కిలోల యూరియా, 5 కిలాల పొటాష్ కలిపి చల్లుకోవాలి. అగ్రికల్చర్ ఆఫీసర్లకు సమాచారం అందిస్తే పంటలను పరిశీలించి సలహాలు, సూచనలు ఇస్తారు.
వెంకటేశ్వర్లు, డీఏవో, మహబూబ్ నగర్