విష జ్వరాలతో ఆదిలాబాద్ విలవిల ..రోగులతో కిటకిటలాడుతున్న దవాఖానాలు​

  • ఒక్కో బెడ్డుపై ఇద్దరేసి  రోగులకు ట్రీట్​మెంట్
  • జ్వరం, దగ్గు, జలుబు కేసులతో అవస్థలు
  • రోగులతో కిటకిటలాడుతున్న దవాఖానాలు​

ఆదిలాబాద్, వెలుగు: విష జ్వరాలు ప్రజలను బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి ఇంట్లో జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ​జిల్లాలో కొన్నిరోజులుగా వర్షాలు పడుతుండటం, వాతావరణ మార్పుల కారణంగా మళ్లీ వైరల్ ఫీవర్స్​ విజృంభిస్తున్నాయి. విష జ్వరాలతో ఇటీవల పలువురు మృత్యువాత పడ్డ సంఘటనలూ ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో ఈ స్థాయిలో జ్వరాలు ప్రబలడంపై డాక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జ్వరాల కారణంగా ప్రభుత్వ దవాఖానాలతో పాటు ప్రైవేట్ హాస్పిటళ్లు సైతం రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానాలో ఓపీ సంఖ్య 1300లకు పెరిగిపోయింది. ఒక్కో బెడ్డుపై ఇద్దరు రోగులకు ట్రీట్మెంట్ అందించాల్సిన పరిస్థతి ఏర్పడింది. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 

వణుకుతున్న పిల్లల వార్డు

రిమ్స్​లో ముఖ్యంగా పిల్లల వార్డులోని బెడ్లు జ్వర బాధితులతో నిండిపోయాయి. ఇక్కడ అడ్మిషన్ తీసుకునేందుకు పిల్లల తల్లిదండ్రులు క్యూలో నిలబడాల్సి వస్తోందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పిల్లల అడ్మిషన్లు పెరిగిపోతుండటంతో రిమ్స్ యాజమాన్యం అదనంగా మరో 20 బెడ్లను ఏర్పాటు చేసింది. డెంగీ, మలేరియా కేసులు కూడా పెరుగుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 40 డెంగీ కేసులు నమోదు కాగా మరో రెండు మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇది కేవలం గవర్నమెంట్ హాస్పిటల్స్ అధికారిక వివరాలు మాత్రమే. డెంగీ చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్స్, హైదరాబాద్, యావత్ మాల్, నిజామాబాద్ కు ట్రీట్మెంట్ కోసం వెళ్లే వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. 

కుటుంబంలో ఒక్కరికి జ్వరం, జలుబు చేసిందంటే చాలు.. ఇంట్లో ఉన్న అందరికీ అంటుకుంటోంది. ముఖ్యంగా చిన్న పిల్లలఇంట్లోంళ్లందరికీ అంటుకుంటోందిపై ప్రభావం చూపుతుండటంతో తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. వచ్చిన వ్యాధి కూడా ఐదారు రోజుల వరకు తగ్గకపోవడంతో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ట్రీట్​మెంట్​కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తున్నవారికి బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. రోజుకు బెడ్ చార్జీలతోపాటు రక్త పరీక్షలు, ముందులు, సెలైన్లతో రోజుకు రూ. 3 వేల నుంచి రూ. 4 వేలు ఖర్చవుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక భారంతో అవస్థలు పడుతున్నారు. 

ALSO READ: తెలంగాణలో సీడబ్ల్యూసీ.. కీలక మార్పులకు వేదిక

వ్యాధుల నియంత్రణేది?

జిల్లాలో వ్యాధుల నియంత్రణ పట్ల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంలో ఫీవర్ సర్వే తో పాటు అక్కడక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహించిన అధికారులు.. ఇప్పుడు వైరల్ ఫీవర్స్​ విజృంభిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. స్పెషల్ క్యాంపుల ఏర్పాటు, వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం, క్లోరినేషన్, శానిటేషన్ గ్రామాలు, పట్టణాల్లో అంతంత మాత్రంగానే ఉంది. దోమల తెరల పంపిణీ అటకెక్కింది. మురికి కాలువలు, చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు క్లీన్​చేయకపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని.. పారిశుధ్యం లోపించడంతోనే వ్యాధులు ప్రభలుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారే తప్పా క్షేత్రస్థాయిలో వ్యాధుల నియంత్రణకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం..

కొన్ని రోజులుగా రిమ్స్ లో వైరల్ ఫీవర్స్ కేసులు భారీగా పెరిగిపోయాయి. గతంలో ఓపీ సంఖ్య 1000 వరకు ఉంటే ఇప్పుడు 1300 దాటుతోంది. మెడికల్ వార్డులతో పాటు చిల్డ్రన్స్ వార్డు కూడా బెడ్లు నిండిపోయాయి. రోగుల రద్దీ దృష్ట్యా ఎప్పటికప్పుడు బెడ్ల సంఖ్య పెంచుతున్నాం. రోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డాక్టర్లు, సిబ్బందిని ఆదేశించాం. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. 

 జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్