- నేలకూలిన కరెంట్ స్తంభాలు, రోడ్లపై కూలిన చెట్లు
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వీచిన ఈదురుగాలులు, కురిసిన వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఎండ వేడితో ఇబ్బందిపడుతున్న జనాలకు ఉపశమనం కలిగింది. అయితే అకాల వర్షం కారణంగా గ్రామాల్లో రైతులు మాత్రం చాలా ఇబ్బందులుపడ్డారు. ఆరబోసుకున్న ధాన్యం, ఐకేపీ సెంటర్లు, వ్యవసాయ మార్కెట్లలో తూకానికి తీసుకొచ్చిన వడ్లు తడిసిపోయాయి. కారుమబ్బులు కమ్ముకోవడంతో కరీంనగర్ సిటీలో పగలే చీకట్లు అలుముకున్నాయి.
ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు . గన్నేరువరంలో గాలివానకు వడ్ల కుప్పలపై టార్పాలిన్లు ఎగిరిపోయాయి. తూకం వేసి లారీ లోడ్ కు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు సైతం తడిచాయి. చొప్పదండి, మానకొండూరు మండల కేంద్రాల్లోని మార్కెట్ యార్డులు, శంకరపట్నం మండలం కేంద్రంలోని ఐకేపీ సెంటర్లో ధాన్యం తడిచింది. చొప్పదండిలోని తోగరు మామిడికుంటకు వెళ్లే దారిలోని మిల్లులకు వచ్చిన లోడ్లను సకాలంలో దించుకోకపోవడంతో ట్రాక్టర్ లోని బస్తాలు కూడా తడిసిపోయాయి. చిగురుమామిడి మండలం సీతారాంపూర్ లో ఈదురుగాలు ధాటికి కరెంట్ స్తంభం, చెట్టు నేలకొరిగాయి.
వడ్ల బస్తాలు తడిచినయ్
జగిత్యాల/గొల్లపల్లి, వెలుగు: జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. గొల్లపల్లి, వెల్గటూర్, మల్యాల మండలాల్లోని కొనుగోలు సెంటర్లలో ధాన్యం తడిసింది. గొల్లపల్లి మార్కెట్ యార్డు, ఐకేపీ సెంటర్లలో వడ్లు తడిచాయి. యార్డులో వడ్లు కొట్టుకుపోయాయి. గొల్లపల్లి మండలంలోని కొనుగోలు సెంటర్లలో 10,340 బస్తాలు తూకం వేసిన బస్తాలు తడిచిపోయాయి.
రాజన్నసిరిసిల్ల, వెలుగు: వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలులకు చెట్లు కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. కొండ్రుపేట మండలం వట్టిమర్ల గ్రామంలో పిడుగు పది పిడుగు పడి గేదె చనిపోయింది.
పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షం, వడగండ్లు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. పెద్దపల్లి, సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, జూలపల్లి, ధర్మారం, ముత్తారం మండలాల్లో భారీ వర్షంతో పాటు వడగండ్లు పడ్డాయి. మిగిలిన మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది. మార్కెట్లలో పోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది.