భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా మండే ఎండలపై అలర్ట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నెలాఖరు వరకు.. అంటే 2024, ఏప్రిల్ 28వ తేదీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని.. మండే ఎండలతోపాటు ఉక్కపోత ఉంటుందని స్పష్టం చేసింది. మధ్యాహ్నం సమయంలో నిప్పుల ఎండలు ఉంటాయని హెచ్చరించింది. రాత్రి సమయాల్లోనూ వేడి గాలులు ఉంటాయని అలర్ట్ ఇచ్చింది. 28వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు, సలహాలు ఇచ్చింది వాతావరణ శాఖ.
అదే విధంగా తెలంగాణలోని దక్షిణ ప్రాంతంలో.. కోస్తా ఆంధ్రలో.. రాయలసీమలో, యానాంలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని.. వేసవి కాలంలో ఇది సాధారం కంటే ఐదు డిగ్రీలు అదనం అని హెచ్చరించింది. ఉదయం 10 గంటల తర్వాత అత్యవసరం అయితేనే బయటకు రావాలని.. సాయంత్రం 5 గంటల వరకు ఇళ్లల్లో ఉంటేనే మంచిదని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, యూపీ, కర్ణాటక, సిక్కిం, మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుందని రిపోర్ట్ విడుదల చేసింది.
మహారాష్ట్ర నుంచి కేరళ వరకు ఉపరితలంపై గాలి ద్రోణి కొనసాగుతుందని.. దీని ప్రభావంతో.. ఏప్రిల్ 24, 25 తేదీల్లో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ.