
జనగామ జిల్లా: జనగామ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీచాయి. భారీ వడగండ్ల వాన పడి కాలువల్లో వాన నీళ్లతో పాటు వడగండ్లు పారాయి. జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులతో కురిసిన భారీ వడగండ్ల వాన రైతులను దెబ్బ కొట్టింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో వర్షానికి రైతుల ధాన్యం తడిసి ముద్దయింది.
మార్కెట్ యార్డులో బయట ఆరబోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. జనగామ, లింగాల గణపురం, రఘునాథపల్లి మండలాల్లో కురిసిన వర్షానికి పంట నేలపాలయింది. పలుచోట్ల రహదారులపై చెట్లు నేలకూలాయి. అకాల వర్షం రైతులను నిండా ముంచిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని సిత్యా తండాలో రాళ్ళ వర్షం కురిసింది. కుమ్రంబీమ్ జిల్లా కాగజ్‌నగర్‌లో కూడా వడగండ్ల వాన కురిసింది. భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయం కావడం గమనార్హం. అకాల వర్షాలతో రైతులు అందోళన చెందుతున్నారు. వరి, కూరగాయలపై ప్రభావం చూపుతుందని రైతులు కలవరపడుతున్నారు.
వాతావరణ శాఖ పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతున్న కారణంగా క్యూమిలో నింబస్ మేఘాల వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు(ఏప్రిల్ 14, 2025) ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్షాల గురించి అప్డేట్ ఇచ్చింది.