భాగ్యనగరం జలమయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతున్నారు. నగరంలోని జూబ్లీహిల్, బంజారాహిల్స్,ఫిలింనగర్, ఖైరతాబాద్, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, మెహదీ పట్నం, సికింద్రాబాద్, బేగంపేట, ప్యాట్నీ, సోమాజిగూడ, రసూల్‌పుర, అమీర్‌పేటలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. వర్షం పడుతుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సహాయక చర్యలు చేపట్టింది..
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు సముద్రమట్టానికి 3 కిలోమీటర్ల నుంచి ఏడున్నర కిలోమీటర్ల మధ్యలో ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం అధికారి వెల్లడించారు. ఏపీ తీరం దగ్గర పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని కేంద్రీకృతమైన ఆవర్తనం బలహీన పడిందని, దీని ప్రభావంతో తెలంగాణలోని 10 జిల్లాల్లో భారీ వానలు పడతాయని తెలిపారు.
మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతుల అప్రమత్తంగా ఉండాలన్నారు.
రైతులు, రైతు కూలీలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, కరెంట్ పోల్స్ కింద, ఎత్తైన చెట్ల కింద ఉండకూడదని తెలిపారు. హైదరాబాద్ లోనూ భారీ వాన పడే అవకాశం ఉందని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. ఇక.. 14, 15 తేదీల్లో హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 30 నుంచి 32 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది అన్నారు. సాయంత్రం మాత్రం వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని వాతావరణ కేంద్రం తెలిపింది.