సిరిసిల్ల నేతన్నలుయ్యాలో.. కోటి చీరలు నేసిరుయ్యాలో
25 వేల మరమగ్గాలతో 15 వేల మంది కార్మికుల రికార్డు
కరోనా టైంలోనూ నాలుగున్నర నెలల్లో టార్గెట్ రీచ్ అయిన్రు
225 డిజైన్లతో చూడముచ్చటగా బతుకమ్మచీరలు
ఇండెంట్ ప్రకారం జిల్లాలకు తరలిస్తున్న ఆఫీసర్లు
రాజన్న సిరిసిల్ల, వెలుగు: కరోనా టైంలో అసాధ్యమనుకున్న పనిని సిరిసిల్ల నేతన్నలు సుసాధ్యం చేశారు. కష్టకాలంలో సర్కారు ఆర్డర్ఇవ్వడం ఒక ఎత్తయితే ఆ ఆర్డర్‌కు అనుగుణంగా సకాలంలో కోటి చీరలు నేసి రికార్డు సృష్టించారు. 15 వేల మంది కార్మికులు నాలుగున్నర నెలలపాటు రేయింబవళ్లు కష్టపడి లక్ష్యం చేరుకున్నారు. 25 వేల మరమగ్గాలతో 225 డిజైన్లతో చూడముచ్చటైన బతుకమ్మ చీరలను నేసి శభాష్ అనిపించుకున్నారు.
ఆర్డర్ ఇచ్చాక.. వచ్చిన కరోనా
ఎప్పట్లాగే ఈ ఏడాది సిరిసిల్ల నేతన్నలకు రూ.320 కోట్ల విలువైన కోటి చీరల తయారీ ఆర్డర్ ఇస్తున్నట్లు ఫిబ్రవరి1నే ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్న టైంలోనే రాష్ట్రంలో కరోనా విజృంభణ మొదలైంది. కేంద్రం లాక్డౌన్ విధించడంతో మార్చి 23న సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ షట్‌డౌన్ అయింది. ముడిసరుకులు, రంగుల దిగుమతులూ నిలిచిపోయి ఎటూ పాలుపోని స్థితిలో సిరిసిల్లలో సాంచాల సప్పుడు ఆగిపోయింది. కరోనా తీవ్రత ఇలాగే ఉంటే తమ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన మాటపై నిలబడి ఆర్డర్కొనసాగిస్తుందా? ఒకవేళ చీరల తయారీకి చాన్స్ఇస్తే తాము ఇన్‌టైంలో కంప్లీట్ చేయగలమా? ఇలా ఎన్నో అనుమానాలు ఇక్కడి నేత కార్మికులను వెంటాడాయి. ఒకవేళ బతుకమ్మ చీరలపై సర్కారు వెనక్కి తగ్గితే కరోనా కష్టకాలంలో తమ కుటుంబాలు పస్తులుండక తప్పదని వాళ్లకు తెలుసు. అందుకే సర్కారు ప్రకటన కోసం కార్మిక కుటుంబాలు ఆశగా ఎదురుచూశాయి. ఆ టైం రానేవచ్చింది. మే5న చీరల తయారీకి సర్కారు గ్రీన్సిగ్నల్ఇవ్వగానే సిరిసిల్ల కార్మిక నేతల్లో హర్షం వ్యక్తమైంది.
రేయింబవళ్లు కష్టపడి..
ప్రభుత్వం పచ్చజెండా ఊపిన మాట వాస్తవమేగానీ కరోనాతో అన్నీ సమస్యలే. ముడిసరుకు సమకూర్చుకోవడం ఒక ఎత్తయితే తయారీ మరో ఎత్తు. ఒకరినొకరు తాకే పరిస్థితి లేదు. వస్తువులను ముట్టుకోవాలన్నా అనుమానమే. కానీ యజమానులు, ఆసాములు, కార్మికులు వెనక్కి తగ్గలేదు. మూతులు, ముక్కులకు మాస్కులు కట్టుకొని, చేతులకు పూసుకునేందుకు శానిటైజర్లు దగ్గర పెట్టుకొని సాంచాలు స్టార్ట్ చేశారు. మొత్తం 25 వేల పవర్‌లూమ్స్ ఆన్ అయ్యాయి. 15 వేల మంది కార్మికులు నెలల పాటు రేయింబవళ్లు కష్టపడి ఏకంగా 7 కోట్ల మీటర్ల వస్త్రం తయారు చేశారు. ఈ చీరల తయారీలో మరో 15 వేల మంది పరోక్షంగా భాగస్వాములయ్యారు. ఈసారి కూలి కూడా గిట్టుబాటైంది. బతుకమ్మ చీరల కారణంగా సుమారు 5 నెలలపాటు సిరిసిల్ల నేతన్నలు ప్రతి నెలా రూ.15 వేల నుంచి రూ.20 వేల పైగా అందుకున్నారు.
ఈసారి 225 డిజైన్లు
బతుకమ్మ చీరలను మొదటి ఏడాది ఒకే డిజైన్‌తో తయారు చేయగా రెండు, మూడో సంవత్సరాల్లో పది, పదిహేను డిజైన్లకే సిరిసిల్ల నేత కార్మికులు పరిమితమయ్యారు. కానీ ఈ ఏడాది మాత్రం ఏకంగా 225 డిజైన్లతో 90 లక్షల చీరలు, సిల్వర్, గోల్డ్ జరీతో10 లక్షల గోచి చీరలు తయారు చేసి వహ్వా అనిపించారు. గోచి చీరలను ప్రత్యేకమైన లూమ్స్‌పై తయారు చేశారు. ఇలా నేసిన బతుకమ్మ చీరలను హైదరాబాద్‌లో జరిగిన మేళాలో మంత్రి కేటీఆర్ పరిశీలించి, సిరిసిల్ల నేతలన్నల పనితీరును ప్రశంసించారు. ఆ మేళాకు వచ్చిన వారంతా బతుకమ్మ చీరల డిజైన్లు చూసి శభాష్ అనకుండా ఉండలేకపోయారు. చేనేత జౌళిశాఖ అధికారులు కూడా యజమానులకు, కార్మికులకు పూర్తిస్థాయిలో సహకరించారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్‌కు అనుగుణంగా కోటి బతుకమ్మ చీరలను పంపిస్తున్నారు.
ఇన్‌టైమ్‌లో చీరల తయారీ
కరోనా ఉన్నప్పటికీ సర్కారు విధించిన గడువులోనే సిరిసిల్ల నేత కార్మికులు బతుకమ్మ చీరలు తయారు చేశారు. 225 డిజైన్లలో పూర్తి క్వాలిటీతో కోటి చీరలను ఉత్పత్తి చేశారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్మేరకు ఇప్పటికే 95శాతం చీరలు సరఫరా చేశాం. ఈ నెల 9 నుంచి చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా నేపథ్యంలో బతుకమ్మ చీరలను ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో ప్రభుత్వ ఆర్డర్లకు అనుగుణంగా చీరలు ఉత్పత్తి చేసిన సిరిసిల్ల నేతన్నలకు చేనేత జౌళిశాఖ తరుపున అభినందనలు.
– ఆశోక్ రావ్, ఏడీ, చేనేత జౌళిశాఖ, రాజన్నసిరిసిల్ల జిల్లా
For More News..