లగ్గాల సీజన్ షురూ .. డిసెంబర్ వరకు మంచి ముహూర్తాలు

లగ్గాల సీజన్ షురూ .. డిసెంబర్ వరకు మంచి ముహూర్తాలు
  • తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పెళ్లిళ్లు
  • షాపింగ్, ఫంక్షన్  హాల్స్, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ, ట్రావెల్స్​కు ఫుల్  బిజినెస్

హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ర్టాల్లో పెళ్లిళ్ల సీజన్  షురూ అయింది. ఈనెల 12 నుంచి డిసెంబర్  వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఈ మూడు నెలల్లో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఆగస్టు చివరి వారం నుంచి దసరా వరకు మంచి రోజులు లేకపోవటంతో పెళ్లిళ్లు ఆగిపోయాయి. మధ్యలో సుమారు 45 రోజుల గ్యాప్ వచ్చింది.  సీజన్  ప్రారంభం కావడంతో జోరుగా పెళ్లిళ్లు జరగనున్నాయి.

ఫంక్షన్  హాల్స్, హోటళ్లు, బాంకెట్ హాల్స్ ఇప్పటికే బుక్  అయ్యాయి. పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఉదయం, రాత్రి రెండు పూటలా వివాహాలు జరుగుతున్నాయని, బుకింగ్ లు పూర్తయ్యాయని పెళ్లి మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో షాపింగ్, గోల్డ్ షాపులు కస్టమర్లతో కళకళలాడగా.. ఇపుడు పెళ్లిళ్ల సీజన్ తో మరింత రద్దీగా మారనున్నాయి. పెద్దఎత్తున పెళ్లిళ్లు ఉండడంతో.. భజంత్రీలు, బ్యాండ్, డీజేతో పాటు డెకరేషన్, క్యాటరింగ్‌‌‌‌‌‌‌‌, ఫొటోగ్రాఫర్లు, ట్రావెల్  ఏజెంట్లు, పురోహితులకు తీరిక లేకుండా ఆర్డర్లు వస్తున్నాయి.

దసరాతో మొదలయ్యే శుభకార్యాలు.. కొత్త ఏడాది వరకు వరుసగా జరగనున్న నేపథ్యంలో వస్త్రాల దుకాణాలు, బంగారం దుకాణాలు కూడా కస్టమర్లతో రష్​ గా మారుతున్నాయి. 45 రోజుల పాటు పెళ్లిళ్లు లేకపోవడంతో ఫంక్షన్ హాల్స్  నిర్వాహకులు అద్దె పెంచారు. ఏడాదిలొ కొన్ని నెలలు మాత్రమే ఫంక్షన్  హాళ్లకు గిరాకీ ఉంటుందని, మిగతా రోజులు అంతా నష్టాలే అని, ఈ నేపథ్యంలోనే అద్దె పెంచామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ఈ మూడు నెలలు పెళ్లిళ్ల వల్ల లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరకనుంది. 

ముహూర్తాలు ఉన్న రోజులు 

  • అక్టోబరులో    :       12, 13, 16, 20, 27 
  • నవంబరులో    :    3, 7, 8, 9, 10, 13,14, 16, 17 
  • డిసెంబరులో    :    5, 6, 7, 8, 11, 12,14, 15, 26