
జమ్మికుంట, వెలుగు: పెండ్లి పత్రిక అంటే మామూలుగా ఒకటి, రెండు పేజీలు, మహా అయితే నాలుగు పేజీలు ఉంటుంది. కానీ, కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సుద్దాల శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు తమ కూతురు రవళిక వివాహం సందర్భంగా 32 పేజీలతో వివాహ విశిష్టతను తెలియజేసేలా ఏకంగా పుస్తకాన్ని ముద్రించి అతిథులను ఆహ్వానించడం ఆసక్తి కలిగించింది.
వివాహానికి సంబంధించిన కల్యాణ సంస్కృతి, పెళ్లిచూపులు, పాణిగ్రహణ శుభ ముహూర్త పత్రిక, పెండ్లి కుమార్తెను చేయడం ,పెండ్లి కుమారుడిని చేయడం, వరపూజ, వధువును గంపలో తేవడం, తెరసాల, కన్యాఫలం, మాంగల్య పూజ, జీలకర్ర బెల్లం, తలంబ్రాలు, బ్రహ్మముడి సప్తపది, ఉంగరాలు తీయించడం, అప్పగింతల పాటతో పాటు పెండ్లిలో జరిగే 32 తంతుల గురించి ఒక్కో పేజీలో ముద్రించి తన కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వానిస్తున్నారు.