ఇది వెరైటీ శుభలేఖ..

ఇది వెరైటీ శుభలేఖ..

వివాహం..ప్రతీ ఒక్కరి జీవితంలో మధుర ఘట్టం. ఈ అపురూప వేడుకను సంతోషంగా..సరికొత్తగా జరుపుకోవాలని కలలు కంటారు. తన పెళ్లి గురించి ప్రతీ ఒక్కరు మాట్లాడుకోవాలని తపనపడుతుంటారు. తమిళనాడుకు చెందిన ఓ అసిస్టెంట్ ఫ్రొఫెసర్  కూడా తన పెళ్లి గురించే మాట్లాడుకోవాలని వినూత్న ఆలోచన చేశాడు. 

పెళ్లిలో శుభలేఖకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే వరుడు అయినా..వధువు అయినా..తమ శుభలేఖను కాస్త డిఫరెంట్గా ఉండేలా చూసుకుంటారు. అయితే తమిళనాడుకు చెందిన ఓ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ తన పెళ్లి కార్డును  చూసి అందరూ ఆశ్చర్యపోయేలా తయారు చేయించాడు. టాబ్లెట్ షీట్ రూపంలో శుభలేఖను అచ్చువేయించి అవాక్కయ్యేలా చేశాడు. 

టాబ్లెట్ శుభలేఖపై అన్ని వివరాలు..
తిరువణ్నామలై జిల్లాకు చెందిన ​ ఎళిలరసన్​.. ఫార్మసీ రంగంలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 5న అతను విల్లుపురం జిల్లాకు చెందిన వసంతకుమారి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు. దీనికోసం అతను టాబ్లెట్ షీట్ రూపంలో తన వెడ్డింగ్ కార్డుని ప్రింట్ చేయించాడు. వెడ్డింగ్​ కార్డు చిన్నగానే ఉన్నా.. దానిపై అన్ని వివరాలు ఉండేలా చూసుకున్నాడు. టాబ్లెట్ పేరుండే చోట ఎళిలరసన్, వసంతకుమారిల విహహం అంటూ ప్రింట్ చేయించాడు. ఎక్స్పైరీ డేట్ ఉన్న చోట పెళ్లి తేదీ, విందు సమయం, రిసప్షన్ తేదీని ముద్రించాడు. వీటితో పాటు...పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెల విద్యార్హతలు.. వారు చేసే పని వంటి ఇతర వివరాలను టాబ్లెట్ కార్డుపై అచ్చు వేయించాడు. మ్యానుఫ్యాక్చర్ డేట్  దగ్గర ఆ శుభలేఖ ఎక్కడ ప్రింట్ అయిందో ఆ ప్రెస్​ అడ్రస్ను  కూడా చేయించాడు. 

షీట్ చూసి అవాక్కు..
టాబ్లెట్ షీట్ రూపంలో పెళ్లికార్డును కొట్టించిన ఎళిలరసన్..తన పెళ్లికి పిలవడానికి ఓ ఇంటికెళ్లాడు. ఎళిలరసన్ చూసిన బంధువులు..అతన్ని పలుకరించారు. ఇంతలో ఎళిలరసన్ తన బంధువులకు టాబ్లెట్ షీట్ తీసి ఇచ్చాడు. అయితే దాన్ని అందుకున్న వారు ఇదేంటని అడగ్గా.. తన పెళ్లి శుభలేఖ అని బదులివ్వడంతో..అవతలి వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని..ఒకటికి రెండు సార్లు చూసి ..చివరకు శుభలేఖ అని నిర్థారణకు వచ్చారు. ప్రస్తుతం ఈ టాబ్లెట్ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టాబ్లెట్ శుభలేఖపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.