బుజ్జగింపులు.. నజరానాలు! .. ప్రలోభాలతో పార్టీలు మార్చే ప్రయత్నాలు

  •  విత్​డ్రా చేసుకుంటే ఇండిపెండెంట్లకు బంఫర్​ ఆఫర్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  ఎన్నికల బరిలో నిల్చిన ఇండిపెండెంట్​ క్యాండెట్లతో పాటు పార్టీలు మారాలనుకునే చోటా మోటా నాయకులకు ప్రధాన పార్టీల లీడర్లు ఆఫర్లు ఇస్తున్నారు. బుధవారంతో నామినేషన్లను విత్​ డ్రా చేసుకునేందుకు ఆఖరి రోజు కావడంతో తప్పుకోవాలంటూ బుజ్జగిస్తున్నారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో దాదాపు 65మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు.

అత్యధికంగా కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లతో పాటు పలు ఇతరత్రా పార్టీలకు చెందిన వారు నామినేషన్​ వేశారు.  బీఆర్​ఎస్, కాంగ్రెస్​ పార్టీలు పోటాపోటీగా ఇండిపెండెంట్లతో పాటు పలు పార్టీల తరుపున పోటీ చేస్తున్న క్యాండెట్లను విత్​ డ్రా చేసుకునేలా ఆయా పార్టీల లీడర్లు మంతనాలు సాగిస్తున్నారు. విత్​ డ్రా చేసుకొని తమ పార్టీలో చేరితే ఒక ఆఫర్, విత్​ డ్రా చేసుకుంటే మరో ఆఫర్​ అంటూ ప్రధాన పార్టీల లీడర్లు ప్రలోభాలకు 
గురిచేస్తున్నారు. 

పక్కాగా పని అయ్యేలా..

ఇల్లెందు నియోజకవర్గంలోని కామేపల్లి మండలానికి చెందిన సీనియర్​ కాంగ్రెస్​ లీడర్, జడ్పీటీసీ భానోత్​ వెంకట ప్రవీణ్​ నాయక్​ తనకు కాంగ్రెస్​ టికెట్​ దక్కకపోవడంతో హైకమాండ్​ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఇండిపెండెంట్​గా నామినేషన్ ​వేశారు. ఇదే అదనుగా భావించిన బీఆర్​ఎస్​ పావులు కదిపింది. నామినేషన్​ను విత్​ డ్రా చేసుకోవడంతో పాటు పార్టీలో చేరాలంటూ బీఆర్​ఎస్​ నేతలు మంతనాలు జరిపారు.  

వెంకట ప్రవీణ్​కు భారీ ఆఫర్లను ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మంత్రి హరీశ్​ రావు సమక్షంలో మంగళవారం వెంకట ప్రవీణ్​ నాయక్​తో పాటు పొన్నేకల్​ ఎంపీటీసీ మాలోత్​ శంకర్​ బీఆర్​ఎస్​ కండువా కప్పుకున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాలతో పాటు భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్న పలువురిని విత్​ డ్రా చేయించేందుకు ప్రధాన పార్టీల లీడర్లు, క్యాండెట్లు పడరాని పాట్లు పడుతున్నారు.