హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో జూన్ 2 నుంచి డివిజన్ స్థాయి పరిపాలన చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్ నెం.12 పరిధి సిటీ మేనేజర్ ట్రైనింగ్ సెంటర్ ఆఫీసులో ఏర్పాటు చేయనున్న డివిన్ ఆఫీసును మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ సర్కిల్ లో 4 డివిజన్ ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డివిజన్ నం.92 ఆఫీసు వెంకటేశ్వర కాలనీలో, డివిజన్ నం. 94 ఆఫీసు షేక్ పేటలో, డివిజన్ నం.95 ఆఫీసు జూబ్లీహిల్స్ లో ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. సమస్యలు తొందరగా పరిష్కరించేందుకు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 150 డివిజన్లలో 10 మంది అధికారుల బృందంతో పాలనా వ్యవస్థ మొదలవుతుందన్నారు.
సిటిజన్లకు అందుబాటులో ఉండేలా డివిజన్ ఆఫీసులను ఏర్పాటు చేస్తామన్నారు. అందులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, డివిజన్ ఎంటమాలజిస్ట్, ఇంజనీర్, టౌన్ ప్లానర్, కమ్యునిటీ ఆర్గనైజర్, శానిటరీ జవాన్, అర్బన్ బయోడైవర్సిటీ సూపర్ వైజర్, కంప్యూటర్ ఆపరేటర్, రిసెప్షనిస్ట్, వాటర్ బోర్డు, విద్యుత్ అధికారులు తొందరలోనే బాధ్యతలు చేపట్టనున్నారని మేయర్ తెలిపారు. రేపటిలోగా డివిజన్ ఆఫీసులను అన్ని సదుపాయాలతో సిద్ధం చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ నెల 31న డివిజన్ ఆఫీసును ప్రారంభిస్తామన్నారు.
శానిటేషన్ కార్మికులకు క్యాన్సర్ గుర్తింపు టెస్టులు
జీహెచ్ఎంసీ సర్కిళ్ల వారీగా పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు క్యాన్సర్ గుర్తింపు టెస్టులు చేస్తున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కార్కినోస్ కార్పొరేట్ బాడీ భాగస్వామ్యంతో ఈ టెస్టులు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నం.12 సీఎంటీఈఎస్ ఆఫీసులో శానిటేషన్ కార్మికులకు కార్కినోస్ ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రతి సర్కిల్ లో ఆరు రోజుల పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. క్యాన్సర్ టెస్టుల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లొద్దని, ప్రభుత్వ ఆసుపత్రులు, ఈఎస్ఐలో చేయించుకోవాలని మేయర్సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్, సీఎంవోహెచ్ డాక్టర్ పద్మజ, అంకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి పాల్గొన్నారు.