- ఏడు రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు
- ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు
వెలుగు నెట్ వర్క్: ‘కాకతీయ వైభవ సప్తాహం’ వేడుకలకు అంతా సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాకతీయుల కట్టడాలు, ఆలయాలను ఆఫీసర్లు ముస్తాబు చేశారు. రాత్రి వేళల్లో కట్టడాలు జిగేలు మనేలా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. ఏడు రోజుల పాటు సాగునున్న ఈ ఉత్సవాల్లో కళాకారులు, కవులు, నృత్యకారులతో అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్టూడెంట్లకు ఎస్సే రైటింగ్, స్పీచ్ కాంపిటీషన్ పెట్టనున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాకతీయుల 22వ వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ రానున్నారు.
ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏడు తరాలు గుర్తుండిపోయేలా ఉత్సవాలు..
వరంగల్, వెలుగు: రాబోయే ఏడు తరాలు గుర్తుండేలా కాకతీయ వైభవ సప్తాహం ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‍భాస్కర్ చెప్పారు. బుధవారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ప్రెస్‍మీట్ నిర్వహించారు. గురువారం నిర్వహించే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న కాకతీయ వారసుడు కమల్‍చంద్ర భంజ్‍దేవ్‍ను ఘనంగా స్వాగతం పలకనున్నట్లు చెప్పారు. 600 మందితో పేరిణి శివతాండవం, జానపద, ఒగ్గు డోలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి ఉత్సవాల ప్రారంభానికి ఖిలా వరంగల్ వెళతారని చెప్పారు. అనంతరం వెయ్యిస్తంభాలగుడిలో పూజలు, అగ్గిలయ్య గుట్ట సందర్శనకు వస్తారని చెప్పారు. వారం రోజుల వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.
వేడుకల్ని సక్సెస్ చేయాలి..
కాశిబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: కాకతీయుల వైభవ సప్తాహ వేడుకల్ని సక్సెస్ చేయాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం బల్దియా హెడ్ ఆఫీస్‌లోని మేయర్ చాంబర్ లో మెప్మా సిబ్బందితో రివ్యూ నిర్వహించారు. ఈ నెల 13 వరకూ సాగే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. ఈ వేడుకల గురించి కమ్యూనిటీ ఆర్గనైజర్లు, రిసోర్స్ పర్సన్లు, ఆర్పీలు, ఓబీలు, స్వయం సహాయక బృంద సభ్యులు, హెచ్‌జీ సభ్యులు విస్తృత ప్రచారం చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఫుడ్ ఫెస్టివల్స్కూడా ఉంటాయన్నారు.
మ్యూజియం ఏర్పాటు చేయాలి
హసన్ పర్తి, వెలుగు: కాకతీయుల చరిత్ర, సంస్కృతి, శిల్పకళా నైపుణ్యం భావితరాలకు తెలిసే విధంగా వరంగల్ లో కాకతీయుల మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునాహరి శేషు కోరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాలార్ జంగ్ మ్యూజియం లాగే ఇక్కడ కూడా మ్యూజియం పెట్టాలన్నారు. తద్వారా టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే కాకతీయుల కట్టడాల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలన్నారు.