ఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు మరింత కఠినం చేసింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూ విధించింది. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రజలు అనవసరంగా బయట తిరగకుండా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు వెళ్లే వారు ఈ పాస్ను వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ పాస్ కోసం www.delhi.gov.in. వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో టికెట్లు చూపిన ప్రయాణీకులను మాత్రమే అనుమతిస్తున్నారు.
కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలు మినహా అన్ని రకాల కార్యకలాపాలపై నిషేధం కొనసాగనుంది. నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు, మెడికల్ షాపులు తెరిచి ఉంటాయి. హోటల్స్, రెస్టారెంట్స్ మూసి ఉన్నప్పటికీ డోర్ డెలివరీకి పర్మిషన్ ఇచ్చారు. పబ్లిక్ పార్కులు మూసివేశారు. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు 20 మందిని, బస్సులు, మెట్రో రైళ్లలో సీటింగ్ కెపాసిటీ మేరకే ప్రయాణికుల్ని అనుమతించనున్నారు.
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. శనివారం సైతం కొత్త కేసుల సంఖ్య 20వేలు దాటవచ్చని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 17శాతంగా ఉంది. వీకెండ్ కర్ఫ్యూ విధించడం ద్వారా కేసుల తీవ్రత కొంతమేర తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.