ఘనమైన కోట గోల్కొండ. దానికి ధీటైన నిర్మాణ సముదాయం కుతుబ్ షాహీ సమాధులు. షాహీ పాలకుల జ్ఞాపకంగానే కాదు వాళ్ల కళాభిరుచి, సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ నైపుణ్యాలకు కుతుబ్ షాహీ సమాధులు నిలువెత్తు సాక్ష్యాలు. కుతుబ్ షాహీల పాలన లో దక్కన్లో భాషా సంస్కృతులు వేగంగా మారిపోయాయి. ఆ మార్పుకు చెరిగిపోని. గుర్తులు ఈ సమాధులు. 1519లో అధికారం చేపట్టిన కుతుబ్ షాహీల వలన మన సంస్కృతి లోకి పర్షియన్, మధ్య ఆసియా దేశాల సంస్కృతి ప్రవేశించింది. అందుకు ఇక్కడ కనిపిస్తున్న నిర్మాణాలే ఉదాహరణ. ఇండో- అరబిక్ నిర్మాణ శైలితో నిర్మించిన ఈ సమాధులు కుతుబ్ షాహీ రాజ వంశీకులవి. ఇస్లామిక్ నిర్మాణ శైలిలో ఇవి ప్రత్యేకమైనవి. ఎత్తైన మినార్లతో ఉండే ఇస్లామిక్ శైలిలోకి గోపురం ప్రవేశించింది.
సమాధులపై అలంకరణ కోసం కళాకారులు అద్భుతమైన స్థకో కళాకృతులను చిత్రించారు. ఇప్పటికీ చెక్కుచెదరని ఆ నిర్మాణ కళ ప్రపంచ వారసత్వం కోసం ఎదురు చూస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం గతంలో ప్రతిపాదించిన ఈ కట్టడాలను మరోసారి ప్రతిపాదించేందుకు కొత్తగా ముస్తాబు చేస్తున్నారు. అమెరికా నిధులు, ఆగాఖాన్ ట్రస్ట్ సహకారంతో పురావస్తు శాఖ కుతుబ్ షాహీ టూంబ్స్కు పూర్వ వైభవం తేవడానికి కృషి చేస్తోంది.
కుతుబ్ షాహీల పాలన అంతమయ్యేంత వరకు పాలించిన పాలకులు, వాళ్ల కుటుంబ సభ్యుల సమాధులు ఇక్కడ ఉన్నాయి. కుతుబ్ షాహీల కాలంలో గొప్ప కళాకారులుగా ప్రసిద్ధిగాంచిన తారమతి, ప్రేమామతి సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి. కుతుబ్ షాహీ సమాధులలో సుల్తాన్ 'కులీ కుతుబ్ ' సమాధి మిగతా సమాధుల నిర్మాణానికి నమూనాగా ఉంది. విశాలమైన పునాదులపై ఎత్తుగా నిర్మించారు. ఈ పునాది ఎటు చూసినా 30 మీటర్ల పొడవుంటుంది.
ఇందులో 21 సమాధులున్నాయి. వాళ్లందరూ సుల్తాన్ కులీ కుతుబుక్కు ఏమవుతారో తెలుపుతూ సమాధులపై చెక్కారు. గోపురం మీద కుతుబ్ షాహీల కాలంలో అలంకరించిన ఎనామిల్ టైల్స్ ఇంకా మిగిలే ఉన్నాయి.
ఇందులోని సమాధులపై తుళూ భాషలో వాళ్ల వివరాలు చెక్కడం విశేషం. కుతుబ్ షాహీ సమాధులన్నింటిలో మహమ్మద్ కులీ కుతుబ్ షా సమాది పెద్దది. ఈ సమాధులపై పర్షియన్ అక్షరాలతో వాళ్ల వివరాలు చెక్కారు. ఈ సమాధులలో జంషీద్ సమాధి ప్రత్యేకమైనది. మెరిసే నల్లరాయితో అలంకరించిన సమాధి ఇదొక్కటే.మిగతా సమాధులకు భిన్నంగా ఉంటుంది. ఇందులో రెండు అంతస్తులుంటాయి. 'చోటే మాలిక్'గా పిలిచే జంషీద్ కుమారుడి సమాధితోపాటు మరో పదహారు సమాధులు ఇందులో ఉన్నాయి. కారణం ఏమిటో కానీ వీటిలోని ఏ ఒక్క సమాధి మీద కూడా అక్షరాలు చెక్కలేదు. 6వ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షాహ్ సమాధి టెర్రస్పై అలంకరించిన ఎనామిల్ టైల్స్ ఇప్పటికీ ఉన్నాయి.
సుల్తాన్ అబ్దుల్లా కాలంలో ప్రసిద్ధిగాంచిన యునానీ వైద్యులు (హకీం) నిజాముద్దీన్ అహమ్మద్ గిలానీ, అబ్దుల్ జబ్బర్ గిలానీల సమాధులను కూడా రాజవంశీకుల సమాధుల మధ్యనే నిర్మించడం కుతుబ్ షాహీల ఉదార స్వభావానికి నిదర్శనం. కుతుబ్ షాహీ రాజవంశీకుల అంతిమ సంస్కారాలప్పుడు స్నానం చేయించేందుకు ప్రత్యేకంగా కొన్ని గదులు ఈ ప్రాంగణంలో నిర్మించారు. ఆ సందర్భంగా నిర్వహించే మత క్రతువుల కోసం మసీదులు నిర్మించారు ఇక్కడ..