
రీసెంట్ డేస్ లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి బరువు అనేది కూడా ఒకటి. దీనికి సరైన వ్యాయామం, ఆహారపు అలవాట్లు పాటించడం తప్పనిసరి. అయితే కొన్ని సార్లు ఎన్ని రకాల డైట్స్ ఫాలో అయినా, జిమ్ కు వెళ్లినా.. వెయిట్ లో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు. అలాంటి వాళ్లు బరువు తగ్గేందుకు రాత్రి సమయంలో తీసుకునే జాగ్రత్తలు, చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బరువు పెరిగేందుకు నిద్ర, ఒత్తిడి, అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వంటి అనేక కారణాల వల్ల బరువు పెరుగుతూ ఉంటాయి. రాత్రిపూట జీవక్రియ కాస్త నెమ్మదిస్తుంది కాబట్టి.. ఈ సమయంలో తేలికైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇది శరీరంపై సానుకూల ప్రభావం చూపించి, బరువు పెరుగుదలను నిరోధిస్తుంది. చాలా మందికి బరువు తగ్గడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పనిగా అనిపించవచ్చు. అలాంటి వారికి సులభమైన వెయిట్ లాస్ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.
పిప్పరమెంట్ టీ
సాధారణంగా రాత్రి సమయంలో పిప్పరమెంట్ టీ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇది జీవక్రియను పెంచడానికి తోడ్పడుతుంది. అంతే కాదు దీని వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. కాఫీలో అధిక మొత్తంలో ఉండే కెఫిన్ నిద్రకు ఆటంకం కలగజేస్తుంది. ఫలితంగా ఇది బరువు పెరిగేందుకు దారి తీస్తుంది. కాబట్టి రాత్రి సమయంలో టీ, కాఫీలకు దూరంగా ఉంటే చాలా మంచిది.
లైట్ డిన్నర్
నైట్ టైంలో జీవక్రియ నెమ్మదిస్తుంది కావున.. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన, చక్కెరతో కూడిన ఆహారం బరువు పెరిగేందుకు కారణమవుతుంది. కాబట్టి మితంగా, తేలికైన ఆహారాన్ని తీసుకోవాలి.
ఆలస్యానికి దూరంగా ఉండాలి
రాత్రి సమయంలో కొంత మంది ఆలస్యంగా భోజనం చేస్తూ ఉంటారు. దీని వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ కాక అనేక సమస్యలను తెచ్చి పెడుతుంది. కాబట్టి ఆహారం తీసుకున్న తర్వాత నిద్రకు మధ్య కాస్త సమయం ఉండేలా చూసుకోవడం మంచిది. అంతే కాదు ఆలస్యంగా తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి బరువు పెరుగుదలను వృద్ధి చేస్తుంది.
అర్థరాత్రి స్నాక్స్
కొన్ని సార్లు అర్థరాత్రి సమయంలో ఏదైనా తినాలని లేదా ఆకలిగా అనిపించవచ్చు. అప్పుడు ఏది పడితే అది కాకుండా ఆరోగ్యకరమైన స్నాక్స్ ను ఎంచుకోవడం ఉత్తమం. ఉదాహరణకు చిప్స్ కు బదులుగా మఖానాస్ లేదా గుమ్మడి గింజలు, పిస్తా పప్పు లాంటివి తీసుకోవాలి. ఇవి బరువు పెరిగేందుకు దారితీసే అదనపు కేలరీలను తీసుకోకుండా నిరోధిస్తుంది.
మద్యం
కొంతమంది రాత్రి పూట మద్యం సేవిస్తూ ఉంటారు. ఇది అలవాటుగా మారితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆల్కహాల్ తీసుకుంటే ఇది జీవక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శరీరంలోని కొవ్వులను మరింత పెరిగేలా చేస్తుంది. అందువల్ల రాత్రి సమయంలో మద్యపానానికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.