తెలంగాణలో తిరుపతిగా భావించే యాదగిరిగుట్ట ఆలయ నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ఆలయానికి సంబంధించిన అన్ని కట్టడాలనూ విస్తరిస్తూ తమ ఉనికి చాటుతోంది. ఈ నేపథ్యంలో ఆలయాని చేరుకునే దారిలో నిర్మితమైన భారీ స్వాగత తోరణం అందర్నీ ఆకట్టుకుంటోంది. అయితే దీన్ని వచ్చే ఫిబ్రవరిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లోపు ఆవిష్కృతం చేయనున్నట్టు తెలుస్తోంది.
కొండపైకి వెళ్లే కనుమదారులను కలుపుతూ వాటి మధ్య వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా కళాకారులు ఈ స్వాగతం తోరణాన్ని నిర్మిమచారు. కొండపైన పంచనారసింహుల ప్రాంగణానికి చేరే దిశలో.. కొండ దిగేటప్పుడు తోరణంపైన వెనకా, ముందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి రూపం.. ఇరువైపులా గరుడాళ్వారుడు, ఆంజనేయస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. తోరణానికి ఇరువైపులా ద్వారపాలకులు, మధ్యలో మహావిష్ణుమూర్తి రూపం, కింది భాగంలో యక్షులు దర్శనమిస్తారు. స్వాగత తోరణం కుడివైపున రక్షణ గోడపైన ఐరావతం, తీర్థజనుల దృశ్యాలను తీర్చిదిద్దిన ఈ కట్టడం వచ్చి, పోయే భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.