నోట్ల రద్దుపై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నం : చిదంబరం

నోట్ల రద్దుపై సుప్రీం  తీర్పును స్వాగతిస్తున్నం : చిదంబరం

నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థించారా? ప్రభుత్వం వాటి లక్ష్యాలను సాధించిందా అనే అంశాన్ని ప్రస్తావించడం అవసరమని తెలిపారు. మెజారిటీ ధర్మాసనం దీనికి మద్దతు పలికినప్పటికీ.. మైనార్టీ తీర్పు మాత్రం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని చిదంబరం పేర్కొన్నారు. నోట్ల రద్దు చట్టవిరుద్దమంటూ జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చిదంబరం ఈ విధంగా స్పందించారు. 

‘నోట్ల రద్దుపై భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. అయినప్పటికీ, ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థించారా, ప్రభుత్వం వాటి లక్ష్యాలను సాధించిందా అనే అంశాన్ని ప్రస్తావించడం అవసరం. లక్ష్యాలను సాధించే అంశంపై సుప్రీం కోర్టులోని మెజారిటీ ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. ఇదే సమయంలో నోట్ల రద్దు చట్టవిరుద్ధ మార్గంలో జరిగినట్లు ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి పేర్కొనడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిది’ అని  చిదంబరం అభిప్రాయపడ్డారు.

నోట్ల రద్దుపై  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జస్టిస్ ఎస్ ఏ నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. డీమానిటైజేషన్పై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య సంప్రదింపుల తర్వాతే నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన 58 పిటిషన్లను ధర్మాసనం కొట్టి వేసింది. రాజ్యాంగ ధర్మాసనంలోని నలుగురు సభ్యులు పెద్దనోట్ల రద్దును సమర్థించారు.