సబ్బండ వర్గాల సంక్షేమ బడ్జెట్.. ఆరు గ్యారెంటీలకు అధిక ప్రాధాన్యత

సబ్బండ వర్గాల సంక్షేమ బడ్జెట్.. ఆరు గ్యారెంటీలకు అధిక ప్రాధాన్యత

ఆదాయం, ఖర్చు మధ్య  స్వల్ప వ్యత్యాసంతో వాస్తవిక బడ్జెట్​ను డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క 40 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను మదినిండా నింపుకొని రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తన బడ్జెట్లో బలమైన పునాదులు వేశారు. వార్షిక బడ్జెట్లో రైతులు, యువత, పేదలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించారు. వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్​ను ప్రతిపాదించారు.  ఇందులో రూ.1,30,154 కోట్లు నిర్వాహణ పద్దు, రూ.1,74,811 కోట్లు ప్రగతి పద్దు, రూ.36,504 కోట్లు మూలధనంగా పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.3,04,467 కోట్లలో రూ.63,344 కోట్లు జీతాలు, పెన్షన్లకు, రూ.56,983 వేల కోట్లు వడ్డీలు, అసలు చెల్లింపుకు కేటాయించారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్  రూ.16 లక్షల 770 కోట్ల  బడ్జెట్ ప్రవేశపెట్టి  సగానికి పైగా నిధులు ఖర్చు చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో 2014-–15 మొదలుకొని 23–-24 ఆర్థిక సంవత్సరం వరకు బడ్జెట్లో కేటాయించిన నిధులు ఖర్చు చేయని వైనాన్ని అసెంబ్లీలో డిప్యూటీ  సీఎం భట్టి  లెక్కలతో సహా రాష్ట్ర ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వంలాగ  ఆడంబరాలకు పోకుండా రూ.3.04 లక్షల కోట్లకు కుదించారు.

బడుగులకు భారీ నిధులు
ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖకు బడ్జెట్లో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పదివేల కోట్ల మార్కు దాటి కేటాయింపులు జరిపారు.  సంక్షేమశాఖలన్నింటికీ కలిపి రూ.34,079 కోట్లు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ  ప్రత్యేక అభివృద్ధి నిధితో కలిపి సంక్షేమానికి రూ.72,396 కోట్లు కేటాయించింది. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6,000 కోట్లు కేటాయించింది.   ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించి ఈ బడ్జెట్లో రూ. 2,900 కోట్లు కేటాయించారు. ఎస్సీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు సీఎం దళిత సాధికారిక పథకానికి రూ.1000 కోట్లు, ఎస్టీ యువ పారిశ్రామికవేత్తల పథకానికి రూ.50 కోట్లు కేటాయించారు.

ప్రత్యేక అభివృద్ధి నిధితో  కలిపి ఎస్సీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.40,232 కోట్లు,(23%),  గిరిజన సంక్షేమానికి రూ.17, 109(9.82%) కోట్లు,  బీసీ సంక్షేమానికి రూ.11,405 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ. 3,591 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వం సబ్ ప్లాన్ చట్టాన్ని పాటించకుండా ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులు మాత్రమే చేస్తూ వాస్తవ వ్యయాన్ని చేయకపోవడంతో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం బ్యాక్​లాగ్​గా ఉన్న రూ.15,120 కోట్లను కూడా కలుపుకొని ప్రభుత్వం తాజాగా కేటాయింపులు చేసింది.

ఆరు గ్యారెంటీలకు అధిక ప్రాధాన్యత
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు గ్యారెంటీల అమలుకు రూ.56,084 కోట్లు కేటాయించారు. ఇందులో  రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, చేయూత పథకానికి రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.12,571 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి రూ.4,305 కోట్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్లు, భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ.600 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1,143 కోట్లు,  మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకానికి రూ.723 కోట్లు,  సన్న రకం వరి రైతులకు బోనస్ కు  రూ.1800 కోట్లు మొత్తంగా 56,084 కోట్లు కేటాయించారు.  ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 6 గ్యారంటీల అమలు బాధ్యత మాది అని బడ్జెట్లో స్పష్టం చేశారు. 

వ్యవసాయం, వైద్యం, విద్య, గ్రామీణాభివృద్ధి
వ్యవసాయం, అనుబంధ రంగాలకు తాజా బడ్జెట్లో రూ.50,167 కోట్లు కేటాయించారు.  మొత్తం ప్రతిపాదిత వ్యయంలో ఇది 16%.   నీటిపారుదల శాఖకు రూ.23,354 కోట్లు కేటాయించారు. ఇందులో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాధాన్య ప్రాజెక్టులకు రూ. 8,774 కోట్లు ప్రతిపాదించారు. వైద్య ఆరోగ్యశాఖ కు  ఈసారి బడ్జెట్లో రూ.12,393 కోట్లు కేటాయించారు.  ఈ సంవత్సరం అదనంగా  రూ.920 కోట్లు కేటాయించారు. విద్యారంగానికి ఈ బడ్జెట్​లో రూ.23,108 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్లో ఇది 7.57%. గత బడ్జెట్​కన్నా ఈ సంవత్సరం రూ.1,816 కోట్లు అదనంగా కేటాయించారు.  పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు రూ.31, 606 కోట్ల కేటాయించారు. గత బడ్జెట్ తో పోలిస్తే సుమారు రూ. 1,790 కోట్లు అధికంగా కేటాయించారు. 

అభివృద్ధే  ధ్యేయంగా..
టోటల్ క్యాపిటల్ వ్యయం పద్దు కింద రూ.36, 504 వేల కోట్లు కేటాయించారు. నీటిపారుదల శాఖకు రూ.12,652 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.4,149 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.3,955 కోట్లు, ప్రణాళికా శాఖకు రూ.3,453 కోట్లు , ఎస్సీ డెవలప్​మెంట్​ శాఖకు రూ.3,121కోట్లు,  ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్ కు రూ.2,157 కోట్లు,  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.1,972 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ.1,4 61 కోట్లు, సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటేరియట్ డిపార్ట్​మెంట్​కు రూ.1,050 కోట్లు కేటాయించారు. హైబ్రిడ్ అన్ యూటి మోడల్(HAM) ద్వారా  40 శాతం ప్రభుత్వ నిధులతో 60 శాతం ప్రైవేటు డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తారు. ఈ బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించారు.

హైదరాబాద్​అభివృద్ధికి..
 హైదరాబాద్ మహానగర అభివృద్ధికి రూ.10,373 కోట్లు కేటాయించారు. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ కు రూ. 2,654 కోట్లు, మూసీ పునర్జీవనం కోసం రూ.1,500 కోట్లు, పాతబస్తీకి మెట్రో రైల్ విస్తరణకు రూ.500 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ఉన్న 138 మున్సిపాలిటీలు, 15 కార్పొరేషన్ల అభివృద్ధికి తాజాబడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించారు.

 ఎం. మధుసూదన్, డిప్యూటీ సీఎం సీపీఆర్ఓ