సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలి

 సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలి

సూర్యాపేట, వెలుగు :  రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్స్, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు ప్రస్తుతం అందించే మెస్ చార్జీలు రూ.1500 నుంచి రూ.4000లకు పెంచాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూరెల్లి మహేశ్​కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలురు, బాలికల వసతి గృహాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ మాట్లాడుతూ విద్యతోనే దేశం అభివృద్ధి సాధిస్తుందని, అలాంటి విద్యారంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపితే ఊరుకోబోమని హెచ్చరించారు.

పెండింగ్​లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్​తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు వెంటనే పూర్తి స్థాయిలో ప్రిన్సిపాల్స్ ను నియమించాలని కోరారు. విద్య, ఆర్థిక, మానసిక, ఆరోగ్య సాధనకై టీఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో నవంబర్ 22న హనుమకొండలో నిర్వహించనున్న విద్యార్థి యుద్ధభేరి మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మహాసభకు సంబంధించిన వాల్​పోస్టర్​ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.