నిర్మల్, వెలుగు: ఎరుకల సామాజికవర్గం అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ ఎంపిక చేసిన నేపథ్యంలో ఆ సామాజికవర్గ సభ్యులంతా నిర్మల్లో మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎరుకల సామాజికవర్గాన్ని గుర్తించి వారికి రాజకీయంగా న్యాయం చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. సామాజికంగా ఎంతో వెనుకబడ్డ ఎరుకల జాతిని పూర్తిస్థాయిలో అభివృద్ధిలోకి తీసుకురావడమే ప్రభుత్వ ఎజెండా అన్నా రు.
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. నిర్మల్లో జరిగిన మైనార్టీలకు ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేసీఆర్ప్రభుత్వం మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తోందన్నారు. మైనార్టీల పేదరికం అంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రబోతు రాజేందర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.