భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: దివ్యాంగుల సంక్షేమం భిక్ష కాదు.. హక్కు అని మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. కొత్తగూడెం రైల్వేస్టేషన్ సెంటర్లో మంగళవారం దివ్యాంగులు చేపట్టిన దీక్షలో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎంకు లేఖ రాస్తానని తెలిపారు. కనీస అవసరాల కోసం దివ్యాంగులు రోడ్డెక్కాల్సి న పరిస్థితి ఉందని టీవీపీఎస్ అధ్యక్షుడు సతీశ్ గుండపనేని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీస్‌లలో దివ్యాంగుల కోసం ర్యాంపులు, టాయ్లెట్లు ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దీక్షకు కాగ్రెస్, సీపీఐ, బీజేపీ, సీపీఎం, బీఎస్పీ, ప్రజా సంఘాల నాయకులు పోట్ల నాగేశ్వరరావు, కోనేరు సత్యనారాయణ, ఎస్కే షాబీర్పాషా, యెర్రా కామేశ్, బాలశౌరి, కూరపాటి రవీందర్, మల్లెల ఉషారాణి, లగడపాటి రమేశ్మద్ధతు తెలిపారు.
ఆక్రమించిన భూమిని గిరిజనులకు పంచాలి
పెనుబల్లి, వెలుగు: గిరిజనేతరుడు ఆక్రమించిన పోడు భూమిని గిరిజనులకు పంచాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కీసరి రాంబాబు డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో మంగళవారం గోండ్వానా సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతరం కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ రమాదేవికి వినతిపత్రం అందజేశారు. సోడే రాంబాబు, తాటి రామకృష్ణ, కొర్సా ప్రభాకర్, ప్రసాద్ పాల్గొన్నారు.
ఆలయ భూముల హద్దులు గుర్తింపు
అన్నపురెడ్డిపల్లి,వెలుగు: మండలకేంద్రంలోని బాలాజీ ఆలయ భూముల సరిహద్దులను గుర్తించేందుకు మంగళవారం దేవాదాయ, ఫారెస్ట్, రెవెన్యూ ఆఫీసర్లు సర్వే నిర్వహించారు. ఆలయానికి 2,264 ఎకరాల భూములు ఉన్నాయి. ఆలయ భూముల మ్యాప్‌ను పరిశీలించి హద్దులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సులోచన, భూ కొలతల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కుసుమకుమారి, తహసీల్దార్ భద్రకాళి, ఈవో వెంకటరమణ, ఫారెస్ట్ సిబ్బంది
పాల్గొన్నారు.
కమనీయంగా శ్రీరామపట్టాభిషేకం
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో మంగళవారం శ్రీరామపట్టాభిషేకం నయనానందరకరంగా జరిగింది. పునర్వసు నక్షత్రం సందర్భంగా కల్యాణం జరిపిన తెల్లారి పట్టాభిషేకం చేయడం ఆనవాయితీ. ముందుగా స్వామికి గర్భగుడిలో గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. అనంతరం గాలి గోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ప్రాకార మండపంలో స్వామికి నిత్య కల్యాణం జరిపారు. మాజీ మంత్రి జలగం ప్రసాదరావు కల్యాణంలో పాల్గొన్నారు. కల్యాణం తర్వాత శ్రీరామపట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా భక్తుల జయజయధ్వానాల మధ్య నిర్వహించారు. సమస్త నదీ, సముద్ర జలాలతో మండపాన్ని ప్రోక్షణ చేశారు. రామదాసు చేయించిన బంగారు ఆభరణాలను అలంకరించారు. రాజముద్ర, కత్తి, కిరీటం అలంకరించి స్వామిని అర్చకులు చక్రవర్తిగా ప్రకటించారు. సీతారామచంద్రస్వామి అనుబంధ ఆలయం యోగానంద లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో సుదర్శన హోమం జరిపారు.
రాములోరి భూముల రక్షణకు పోరాటం
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం భూములను రక్షించడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి తెలిపారు. అయోధ్య తరహాలో భద్రాద్రిలో మరో ఉద్యమం చేస్తామని ప్రకటించారు. మంగళవారం పురుషోత్తపట్నం దేవస్థానం భూముల్లో నిర్మించిన గోశాలలో గోపూజ చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాముడి భూములు కాపాడే బాధ్యత వీహెచ్పీదేనని అన్నారు. న్యాయపోరాటం చేస్తామని, ప్రతీ హిందువును ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తామని, ఆక్రమణలు తొలగించి తీరుతామని చెప్పారు. అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వబోమని తెలిపారు.
కార్డన్ సెర్చ్ లో 21 బైక్‌లు సీజ్
చండ్రుగొండ,వెలుగు: మండలంలోని వెంకటయ్యతండా పంచాయితీ శివారు కరిశలబోడు గ్రామంలో మంగళవారం జూలూరుపాడు సీఐ వసంతకుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ఇండ్లలో సోదాలు నిర్వహించి సరైన పత్రాలు లేని 21 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామంలో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులకు సహకరించాలని సూచించారు. చండ్రుగొండ, జూలూరుపాడు ఎస్ఐలు విజయలక్ష్మి, గణేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీ ప్రారంభం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని కలెక్టర్ అనుదీప్ అన్నారు. పాల్వంచలో నిర్మించిన మెడికల్ కాలేజీని హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన జిల్లాకు మెడికల్ కాలేజీ రావడం అదృష్టమన్నారు. ప్రిన్సిపాల్ లక్ష్మణ్‌రావు, సూపరింటెండెంట్ డాక్టర్ కుమారస్వామి పాల్గొన్నారు.
టేకుచెట్ల నరికివేత..
పాల్వంచ ప్రధాన రహదారి నుంచి మెడికల్ కాలేజీకి వెళ్లే దారిలో రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం కోసం దాదాపు 2వేల టేకు చెట్లను నరికివేశారు. అడవులు అంతరిస్తున్న క్రమంలో చెట్లను నరికి వేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అనుమతితోనే చెట్లను నరికి వేశామని అధికారులు చెబుతున్నా రోడ్డుకు పెద్దగా ఇబ్బంది లేదని పలువురు పేర్కొన్నారు.
విద్యా ప్రమాణాలు పెంచేందుకే తొలిమెట్టు
ఖమ్మం టౌన్, వెలుగు: విద్యా ప్రమాణాలు పెంచేందుకే తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం ప్రజ్ఞా సమావేశ మందిరంలో విద్యాధికారులు, తొలిమెట్టు నోడల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు కనీస అభ్యాసన సామర్ధ్యాలతో పాటు తరగతికి సంబంధించిన పాఠ్యాంశాలు అర్థమయ్యేలా కృషి చేయాలన్నారు. జిల్లా స్ధాయిలో 84 మంది మండల రిసోర్స్పర్సన్లకు, మండల స్ధాయిలో 2293 మంది టీచర్లకు తొలిమెట్టు అమలుపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఎంఈవోలు, హెచ్ఎంలు కార్యక్రమ పర్యవేక్షణపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఈవో యాదయ్య, రాజశేఖర్, ఏఐఎస్ కోఆర్డినేటర్ రామకృష్ణ పాల్గొన్నారు.
గిరిజనేతరుల పోడు హక్కులు రద్దు చేయాలి
భద్రాచలం,వెలుగు: క్రాంతివీర్ బీర్సాముండా జయంతి సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గిరిజనేతరుల పోడు భూముల హక్కులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు. ముందుగా బీర్సాముండా ఫొటోతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సున్నం వెంకటరమణ మాట్లాడుతూ ఏజెన్సీలో ఆదివాసీలకు దక్కాల్సిన అటవీ హక్కుల చట్టం గిరిజనేతరులకు వర్తింపజేయడం సరైంది కాదన్నారు. గిరిజనేతరులు అడవిని చేస్తున్నారన్నారు. గిరిజనేతరుల కుట్రలను ప్రభుత్వం నియంత్రించాలని కోరారు.
ఉత్పత్తితో పాటు సేఫ్టీకి ప్రాధాన్యం
మణుగూరు, వెలుగు: సింగరేణిలో పని చేస్తున్న ప్రతీ కార్మికుడు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని కొత్తగూడెం రీజియన్ సేఫ్టీ జనరల్ మేనేజర్ జె కుమారస్వామి సూచించారు. మణుగూరు ఓసీలో మంగళవారం కార్పొరేట్ సేఫ్టీ టీమ్ పర్యటించింది. ఈ సందర్భంగా ఓపెన్ కాస్ట్ లలో మేనేజ్మెంట్ ప్లాన్ ను అమలు చేస్తున్న వారికి రక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైన్స్ లో ఎలాంటి ప్రమాదం జరగకుండా కోల్ ప్రొడక్షన్ సాధించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సేఫ్టీ ప్రికాషన్స్ ను వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ డీజీఎం జీఎస్ గోపాలరాజు, ఎస్ఓటు జీఎం డి.లలిత్ కుమార్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ వెంకటరమణ, మేనేజర్ రాజేశ్వరరావు, ఆర్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
గోదావరి నీళ్లతో చెరువులు నిండాలి
అశ్వారావుపేట, వెలుగు: గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండాలన్నదే తన లక్ష్యమని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం అశ్వారావుపేట శివారులోని వెంకమ్మ చెరువు భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మండలంలోని వెంకమ్మ చెరువు నుంచి పాలేరు జలాశయం వరకు ప్రతి చెరువుకు గోదావరి జలాలు వస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని చెప్పారు. కార్యకర్తలు న్యాయం, ధర్మం వైపు నిలబడాలని సూచించారు. మురళి మహిపాల్, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కోటగిరి సీతారామస్వామి, కాసాని వెంకటేశ్వరరావు, సంక ప్రసాద్, సూర్యప్రకాశరావు, చిన్నంశెట్టి సత్యనారాయణ, బీర్రం వెంకటేశ్వరరావు, నిర్మల పుల్లారావు, తాడేపల్లి రవి పాల్గొన్నారు.
రూ.50 వేల ఆర్థిక సాయం
ఖమ్మం రూరల్, వెలుగు: అనారోగ్యంతో చనిపోయిన కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామానికి చెందిన సలీం కుటుంబానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రూ.50 వేల ఆర్థికసాయం చేశారు. భర్త చనిపోయి ఇద్దరు పిల్లలను పోషించేందుకు ఇబ్బంది పడుతున్న దుర్గ, ఇద్దరు చిన్నారులను ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆర్థికసాయం అందజేసి కూరగాయల వ్యాపారం చేసుకుంటూ పిల్లలను మంచిగా చదివించాలని సూచించారు.
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో..
మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల చనిపోయిన 30 మంది కుటుంబాలను ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సతీమణి విజయమ్మ మంగళవారం పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 10 వేల చొప్పున ఆర్థికసాయం అందించి వారిని ఓదార్చారు. ఆమె వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, ముత్యం కృష్ణారావు ఉన్నారు.
‘గిరిజనులను రాష్ట్ర సర్కారు పట్టించుకుంటలేదు’
తల్లాడ, వెలుగు: ఆదివాసీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. సోమవారం ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామాన్ని మండల నాయకులతో కలిసి సందర్శించారు. గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త మేడేపల్లి గ్రామంలో కనీస వసతులు కల్పించకపోవడం దారుణమన్నారు. ఇటీవల ఖమ్మంలోని ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతూ చనిపోయిన చిన్నారి సుక్కి కుటుంబాన్ని పరామర్శించారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించిన వారిపై, డెడ్‌బాడీ తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
బేతంపూడిలో హెల్త్ క్యాంప్
సుజాతనగర్, వెలుగు: మండలంలోని స్టేషన్ బేతంపూడి గ్రామంలో ఐసీఎంఆర్ టీమ్ హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న వారి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. వాటర్ శాంపిల్స్ తీసుకొని వారి ఆహారపు అలవాట్లను అడిగి తెలుసుకున్నారు. రిపోర్టులను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. నివేదికల ఆధారంగా కేంద్రం సాయం అందింస్తుందని ఐసీఎంఆర్ ప్రతినిధులు తెలిపారు. ఎన్‌ఐఎన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ పోటు వినోద్, డీఎంహెచ్ వో దయా నంద స్వామి, డాక్టర్ రాకేశ్ పాల్గొన్నారు.