సంక్షేమ రాజ్యం దిశగా అడుగులు!

తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం  మహిళలకు ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్లు, పేదల గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గత ప్రభుత్వంలో లేని కొత్త పథకాలను అమలులోకి తెచ్చింది.  ఈ ఏడాది అమలుకాబోతున్న ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను పేద, బడుగు బలహీన వర్గాలు స్వాగతిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా  గతంలో రైతుబంధు పేరిట ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఈసారి సమూలంగా మార్చి వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా పేరిట ఎకరానికి రూ.6వేలు అందించబోతున్నారు. ప్రతి ఏడాది రూ.500 పెంచుతూ  లక్ష్యం నెరవేరేలా ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.  రాళ్లు, రప్పలు, గుట్టలు వంటి సాగుకు యోగ్యంకాని భూములను రైతు భరోసా నుంచి మినహాయించబోతున్నారు. 

గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రతి సీజన్​లో 65 లక్షల వ్యవసాయ యోగ్యంకాని భూములకు  రైతుబంధు పథకం కింద డబ్బులు జమ చేసింది.  కోట్లాది రూపాయల ప్రజాధనం దుబారాగా  ఖర్చు చేశారు.  ఈసారి  శాటిలైట్, జీయో టాగింగ్ తోపాటు నాలుగైదు శాఖల సంయుక్త ఆధ్వర్వంలో సాగు భూముల లెక్కలు తీసి రైతు భరోసా నిధులను జమ చేయబోతుండడం రైతు వర్గాలు స్వాగతిస్తున్నాయి.   గణతంత్ర దినోత్సవం నుంచి సాగుచేసే  ప్రతి ఎకరాకు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయబోతున్నది.  ప్రజాప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిలోనే ఏక కాలంలో 25,35,963 మంది రైతు కుటుంబాలకు రెండు లక్షల చొప్పున 21వేల కోట్లు రుణమాఫీ చేసి దేశంలోనే ఈ ప్రభుత్వం చరిత్రను సృష్టించింది. 

వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యం

ఒక్క వానాకాలం సీజన్ లోనే 60 శాతం సన్నాల సాగు పెరిగిందంటే  రైతులపట్ల ప్రభుత్వ ప్రోత్సాహాన్ని  గమనించవచ్చు.  రైతు బీమా,  పంటల బీమా పథకానికి గతంలో లేనన్ని నిధులు వెచ్చించి రైతు వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం మరింత చేరువైంది.  రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో 35 నుంచి 40 శాతం  వ్యవసాయ రంగానికి వెచ్చించి ఖర్చు చేస్తున్న తీరు హర్షణీయం. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతు కూలీలకు రూ.12వేల చొప్పున, అది కూడా జనవరి 26 నుంచే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దాదాపు 50 లక్షల మంది కూలీలకు ఒక్కొక్కరి ఖాతాల్లో ఏడాదికి రూ.12వేలు జమకానుంది. 

ఇందిరమ్మ ఇండ్లతో పేదలకు లబ్ధి

సంక్రాంతి పండుగ తర్వాత ప్రజల ముందుకు రాబోతున్న మరో పథకం ఇందిరమ్మ ఇండ్లు.  గత  పదేండ్లలో 1,58,860  డబుల్ బెడ్ రూంలు మాత్రమే నిర్మించి 1,09,492 మంది లబ్ధిదారులకు మాత్రమే  ఇండ్లను ఇచ్చినట్టు గృహ నిర్మాణ శాఖ లెక్కలు చెపుతున్నాయి. అంటే పదేండ్లలో కేవలం లక్ష మందికిపైగా మాత్రమే ఇండ్లు ఇచ్చారు. అయితే, జిల్లాలవారీగా తీసుకుంటే నారాయణపేట జిల్లా మొత్తానికి డబుల్ బెడ్ రూంల  ఇండ్ల వాసన అంటే తెలియదు.

ఇక నియోజకవర్గాలవారీగా తీసుకుంటే వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లూ మంజూరీ కాలేదు. ఇవాళ ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 85 లక్షల మంది దరఖాస్తులు  చేసుకున్నారు.  ప్రభుత్వం ఓ ప్రత్యేక యాప్ ద్వారా సర్వేలు చేసి ఇండ్లు లేని పేదల వివరాలు సేకరిస్తోంది. ఈ ఏడాదిలో నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.  ఈ లెక్కన నాలుగేండ్లలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం.

-  బండి పల్లవి,
జిల్లా సమాచార,
పౌర సంబంధాల అధికారిణి, జనగాం