దేవరకొండ, వెలుగు : కేంద్ర మాజీమంత్రి సూదిని జైపాల్‌రెడ్డి స్మారకార్ధం నల్గొండ జిల్లా దేవరకొండలో నిర్మించిన లైబ్రరీ బిల్డింగ్‌ను శుక్రవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ చిన్నతనంలో దేవరకొండలో చదువుకున్న జైపాల్‌రెడ్డి స్మారకార్థం ఇక్కడ లైబ్రరీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. లైబ్రరీలో అన్ని వర్గాల ప్రజలకు పుస్తకాలను అందుబాటులో ఉంచాలన్నారు. నల్గొండలోని లైబ్రరీలో కొత్తగా కట్టిన రీడింగ్ రూంకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. రాజ్యసభ సభ్యుడు కేశవరావు మాట్లాడుతూ జైపాల్‌రెడ్డి మన మధ్య లేకపోయినా ఆయన చేసిన ఎన్నో సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. ఆయన జ్ఞాపకార్థం రెండు మూడు జిల్లాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం తానే నిధులను సమకూర్చుతానని, దేవరకొండలోని లైబ్రరీపై నిర్మించే ఫస్ట్ ఫ్లోర్‌కు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే దేవరకొండ లైబ్రరీకి 300 బుక్స్ అందిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో జడ్పీచైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఆర్డీవో గోపీరాం, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బాలమ్మ పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ పథకాలు దేశానికే ఆదర్శం
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
మునుగోడు, వెలుగు : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా మునుగోడులో శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయన్నారు. మిషన్ భగీరథ కారణంగానే మునుగోడు ప్రజలకు ఫ్లోరోసిస్ నుంచి విముక్తి కలిగిందన్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లకుండా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పంటల ఉత్పత్తి రంగంలో దేశంలోనే తెలంగాణ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిందన్నారు. మునుగోడు అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని చెప్పారు. మునుగోడు ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి అండగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి ఎమ్మెల్సీ తక్కడపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ స్వామియాదవ్ పాల్గొన్నారు.
బతుకమ్మ చీరల పంపిణీ
సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువుటద్దం అన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితా దేవి ఆనంద్, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్‌డే వేడుకలకు హాజరయ్యారు.
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయండి
సూర్యాపేట, వెలుగు : బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూచించారు. శాఖల వారీగా పండుగను నిర్వహించాలని, ఇందుకోసం పట్టణ సమీపంలోని సద్దల చెరువు వద్ద ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని మహిళా ఉద్యోగులు ప్రతిరోజు బతుకమ్మ సంబురాల్లో పాల్గొనాలని సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చెరువు వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రజావాణి అర్జీలు పరిష్కరించకపోతే చర్యలు
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఇన్‌టైంలో పరిష్కరించకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అర్జీలు పరిష్కారం కాకపోవడంతో మళ్లీ మళ్లీ వస్తున్నారన్నారు. ఇక నుంచి 15 రోజుల్లోనే ఫిర్యాదులను పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో కిరణ్‌కుమార్, డీఆర్‌వో రాజేంద్రకుమార్, డీపీవో యాదయ్య, డీఎంహెచ్‌వో కోట చలం, ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ మాధవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి.సత్యనారాయణరెడ్డి, డిడబ్ల్యువో జ్యోతి పద్మ పాల్గొన్నారు.
ఇండ్ల స్థలాల కోసం కలెక్టరేట్ల ముట్టడి
సూర్యాపేట వెలుగు : పేదల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఏ ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్లు ఇవ్వాలని కోరుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. భూములకు పట్టాలు పంపిణీ చేసి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు మంజూరు చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ ఇండ్లకు నిధులు మంజూరు చేసి త్వరగా పూర్తి చేయాలన్నారు. రేషన్ కార్డులు లేక లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు వెంటనే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవో శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. ప్రజా పోరాట వేదిక జిల్లా కన్వీనర్ మల్లు నాగార్జున, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి
నల్గొండ అర్బన్, వెలుగు : పేద, బడుగు బలహీన వర్గాలకు ఇంటి స్థలాలు కేటాయించి, ఇండ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నల్గొండ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని, ఇండ్లు లేని వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరారు. ప్రజా సమస్యల సాధన కోసం పోరాటం సాగిస్తామన్నారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు సీపీఎం లీడర్లను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, సలీం, నారి అయిలయ్య, నాగార్జున, బండా శ్రీశైలం, నాగిరెడ్డి, ప్రభావతి, లక్ష్మీనారాయణ, మురళి, సైదులు పాల్గొన్నారు.
మీ ఇష్టం వచ్చినట్లు హాస్పిటళ్లు నడుపుతరా?
ప్రైవేట్ హాస్పిటల్స్‌పై డీఎంహెచ్‌వో ఆగ్రహం
మిర్యాలగూడ, వెలుగు : ‘స్టాఫ్‌కు క్వాలిఫికేషన్ లేదు.. హాస్పిటళ్లలో వసతులు లేవు.. రేట్ల వివరాలు కనిపించవు.. ప్రభుత్వ రూల్స్ పాటించరు.. మీ ఇష్టం ఉన్నట్లు హాస్పిటళ్లను నడుపుతారా ?’ అంటూ నల్గొండ డీఎంహెచ్‌వో కొండల్‌రావు ప్రైవేట్ హాస్పిటల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ రవిశంకర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో కేస రవితో కలిసి మిర్యాలగూడ పట్టణంలోని 16 ప్రైవేట్ హాస్పిటల్స్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80 శాతం హాస్పిటల్స్‌లో పేషెంట్లకు అందించే వైద్య సదుపాయలకు మించి ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. రూల్స్‌కు విరుద్ధంగా ఉన్న ల్యాబ్‌లకు పర్మిషన్ ఎలా ఇచ్చారని ఆఫీసర్లను ప్రశ్నించారు. పట్టణంలోని వసంత మెటర్నటీ అండ్ సర్జికల్, శ్రీ పద్మావతి హాస్పిటల్, అను మల్టీస్పెషాలిటీ, ఎలైట్ హాస్పిటల్‌తో పాటు మొత్తం నాలుగు ల్యాబ్స్, ఆదిత్య మెడికల్ కేర్ సెంటర్‌లో ఎక్స్‌రే ల్యాబ్‌ను సీజ్ చేసినట్లు చెప్పారు. అలాగే స్థానికేతర డాక్టర్ పేరిట నడుస్తున్న చాణక్య మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ తో పాటు సాయిరితిక హాస్పిటల్‌ను సీజ్ చేశారు. ఉపేందర్, సీహెచ్‌వోలు స్వామి, వెంకయ్య, హెచ్‌ఈవో వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.
మల్లేపల్లి పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
దేవరకొండ (కొండమల్లేపల్లి), వెలుగు : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ రెమారాజేశ్వరి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల సంఖ్య తగ్గించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. షీటీమ్‌ల పనితీరు బాగుందన్నారు. అన్ని గ్రామాల్లో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేశ్వర్‌రావు, ఎస్సై నారాయణరెడ్డి పాల్గొన్నారు.