మునుగోడు , వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని ఉపఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి కోరారు. గురువారం నల్గొండ జిల్లా మునుగోడులోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర మహిళా మోర్చా సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రూపొందించిందని, వాటిని గడపగడపకూ తిరుగుతూ వివరించాలన్నారు.
బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎలాంటి పథకాలున్నాయో ప్రజలకు తెలిసేలా చేయాలన్నారు. కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్ అందజేసి ప్రజలను ఆదుకుందన్నారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ డబ్బులు, మద్యంతో ఓటర్ మైండ్ ను మార్చే అవకాశాలున్నాయని, దాన్ని బీజేపీ కార్యకర్తలు తిప్పి కొట్టాలన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, మహిళా మోర్చా నాయకులు పాల్గొన్నారు.