CM Mamata Banerjee: నీతి ఆయోగ్ మీటింగ్పై రచ్చ.. మధ్యలోనే వెళ్లిపోయిన సీఎం మమతా బెనర్జీ

CM Mamata Banerjee: నీతి ఆయోగ్ మీటింగ్పై రచ్చ.. మధ్యలోనే వెళ్లిపోయిన సీఎం మమతా బెనర్జీ

ఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్యలోనే వైదొలిగి వెళ్లిపోవడం పెను దుమారం రేపింది. హస్తిన రాజకీయ వర్గాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శనివారం నాడు నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్ప విపక్ష ఇండియా కూటమిలోని రాజకీయ పార్టీలన్నీ బహిష్కరించాయి. మమతా బెనర్జీ ఈ సమావేశానికి హాజరయినప్పటికీ తన మైక్ను మ్యూట్ చేశారని, మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ సమావేశం మధ్యలోనే ఆమె వెళ్లిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం నుంచి సీఎం మమత అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తాను మాట్లాడుతుండగా ఐదు నిమిషాలకే తన మైక్రోఫోన్ను స్విచ్డ్ ఆఫ్ చేశారని ఆమె ఆరోపించారు. ఇతర ముఖ్యమంత్రులకు సుదీర్ఘంగా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని మమతా బెనర్జీ చెప్పారు. మమతా బెనర్జీ ఆరోపణలను నీతి ఆయోగ్ కొట్టిపారేసింది.

ఈ సమావేశానికి మొత్తం 10 మంది హాజరు కాలేదని.. కేరళ, కర్నాటక, తెలంగాణ, బీహార్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి గైర్హాజరయ్యారని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరయ్యారని చెప్పారు. మధ్యాహ్న భోజన సమయం కంటే ముందు తనకు సమయం కేటాయించాలని ఆమె కోరారని, తాను నిజాలను మాత్రం మీ ముందు పెడుతున్నానని నీతి ఆయోగ్ సీఈవో సుబ్రమణ్యం మీడియాకు తెలిపారు. ఒక్కో రాష్ట్ర ముఖ్యమంత్రికి మాట్లాడేందుకు ఏడు నిమిషాలను కేటాయించినట్లు చెప్పారు. స్క్రీన్ పైన క్లాక్లో ఇంకెంత సమయం మిగిలి ఉందో మాట్లాడే వారికి స్పష్టంగా కనిపిస్తుందని.. ఏడు నుంచి ఆరు, ఆరు నుంచి ఐదు, ఐదు నుంచి నాలుగు, నాలుగు నుంచి మూడు నిమిషాలకు సమయం మారిపోతూ కనిపిస్తుందని.. సమయం అవగానే జీరో చూపిస్తుందని చెప్పారు. మమతా బెనర్జీ మాట్లాడిన సందర్భంలో కూడా ఇదే జరిగిందని, ఇంతకు మించి ఏమీ జరగలేదని నీతి ఆయోగ్ సీఈవో చెప్పుకొచ్చారు. కోల్కత్తాకు ఫ్లైట్ టైం కావడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారని సుబ్రమణ్యం తెలిపారు.