
కోల్కతా: కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకునేందుకు కుట్ర చేస్తోందని.. ఇందులో భాగంగానే భారత సీఈసీగా జ్ఞానేష్ కుమార్ను నియమించిందని టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. గురువారం (ఫిబ్రవరి 27) నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన టీఎంసీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ.. ఇటీవల జరిగిన ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ నుండి నకలీ ఓటర్లను చేర్చడం ద్వారా బీజేపీ గెలిచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా భారత ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా మారకపోతే.. స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికలు జరగవని ఆమె నొక్కి చెప్పారు. సీఈసీ సెలక్షన్ కమిటీ నుంచి సీజేఐని తొలగించి.. భారత ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కాగా, ఇటీవల కేంద్రం సీఈసీగా జ్ఞానేష్ కుమార్ను నియమించిన విషయం తెలిసిందే. అయితే.. సీఈసీ సెలక్షన్ ప్యానెల్ నుంచి సీజేఐని తొలగించి ప్రధాని నామినేట్ చేసిన కేబినెట్ మంత్రికి చోటు కల్పించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీఈసీ ఎంపిక కమిటీ నుంచి సీజేఐను తొలగించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ను నియమించింది. కోర్టులో పిటిషన్లు విచారణలో ఉండగానే.. సీఈసీని నియమించడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.