- మీరైనా జోక్యం చేసుకోండి..!
- బాధిత కుటుంబానికి న్యాయం చేయండి.. రాష్ట్రపతి, ప్రధానికి జూనియర్ డాక్టర్ల లేఖ
- కోల్‌కతా ఘటనలో బెంగాల్ సర్కార్ విఫలమైంది
- జోక్యం చేసుకుని, న్యాయం చేయాలని వినతి
- నిందితుడికి నార్కో టెస్ట్‌కు సెల్దా కోర్టు నిరాకరణ
- సీఎం మమతతో వేదికలు పంచుకోనన్న గవర్నర్
కోల్‌కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ట్రైయినీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని జూనియర్ డాక్టర్లు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.
మెడికోలపై టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలతో దుమారం
ఆర్జీ కర్ రేప్ కేసు ఘటనలో నిరసనలు తెలియజేస్తున్న మెడికోలు డాక్టర్లు అయ్యేందుకు అనర్హులు అంటూ టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద కామెంట్లు చేశారు. లైవ్ స్ట్రీమ్ డిమాండ్‌కు అంగీకరించలేదని సీఎం మమతతో చర్చలను బహిష్కరించడం సరికాదన్నారు. నిరసనల్లో పాల్గొన్న వాళ్లను ఫైనల్ ఎగ్జామ్స్ రాసేందుకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఎంతో మంది రోగుల ప్రాణాలను మెడికోలంతా రిస్క్‌లో పెడ్తున్నారు.
డాక్టర్లుగా సేవ చేసేందుకు వీరంతా అన్ ఫిట్ అంటూ విమర్శించారు. కాగా, స్వాస్థ భవన్ ముందు జూనియర్ డాక్టర్ల ధర్నా శుక్రవారంతో మూడో రోజుకు చేరుకున్నది. జూడాలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఐదు డిమాండ్లు వెంటనే పరిష్కరించాలన్నారు. సీఎం మమతా బెనర్జీతో చర్చలను లైవ్ టెలికాస్ట్ చేస్తేనే సెక్రటేరియెట్‌కు వస్తామని తేల్చి చెప్పారు.
మమతపై గవర్నర్ ఆనందబోస్ మండిపాటు
మమతా బెనర్జీతో కలిసి ఇకపై వేదికలు పంచుకోనని గవర్నర్ సీవీ ఆనంద బోస్ తెలిపారు. ఆమెను సామాజికంగా బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. మమత ‘లేడీ మాక్‌బెత్ ఆఫ్ బెంగాల్’ అంటూ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘ట్రైయినీ డాక్టర్‌పై అఘాయిత్యం జరగడానికి సీఎం మమతా బెనర్జీనే కారణం. ఆమె రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంటాం” అని గవర్నర్ వీడియోలో పేర్కొన్నారు.
‘నార్కో’కు నిందితుడు నో..
ట్రైయినీ డాక్టర్ హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు అనుమతించాలని సీబీఐ చేసిన రిక్వెస్ట్‌ను సెల్దా కోర్టు తిరస్కరించింది. నార్కో టెస్ట్‌కు నిందితుడు అంగీకరించలేదని, అందుకే అనుమతిని రద్దు చేస్తున్నట్లు చెప్పింది. దీనికి ముందు, రాయ్ అంగీకారం కోసం శుక్రవారం అతన్ని సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అతడికి ఇప్పటికే పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించామని సీబీఐ కోర్టుకు తెలిపింది. నార్కో టెస్ట్ చేస్తే మరింత క్లారిటీ వస్తుందని కోరింది. స్పందించిన కోర్టు.. నిందితుడి అభిప్రాయం కోరగా.. అతను టెస్ట్‌కు నిరాకరించాడు. దీంతో నార్కో టెస్టుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు.