బెంగాల్​లో హింస పంచాయతీ ఎన్నికల్లో గొడవలు.. ఒక్కరోజే 12 మంది మృతి

  • టీఎంసీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు 
  • ప్రతిపక్షాలే కుమ్మక్కై దాడులు చేశాయన్న తృణమూల్ 
  • జూన్ 8 నుంచే  హత్యలు.. మొత్తం 31 మంది బలి

కోల్ కతా:  పశ్చిమ బెంగాల్ లో శనివారం పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు, హింస చోటు చేసుకున్నాయి. అనేక చోట్ల శుక్రవారం రాత్రి నుంచే గొడవలు మొదలయ్యాయి. టీఎంసీ, సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు ప్రత్యర్థి వర్గాలపై దాడులకు పాల్పడ్డారు. శనివారం ఒక్కరోజే ఈ దాడుల్లో ఆయా పార్టీలకు చెందిన 12 మంది మృతి చెందారు. మృతుల్లో టీఎంసీ కార్యకర్తలు 8 మంది, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ పార్టీల కార్యకర్తలు ఒక్కొక్కరు ఉన్నారని అధికారులు వెల్లడించారు.

ప్రధానంగా ముర్షిదాబాద్, నదియా, కూచ్ బెహర్, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలు, భాన్ గర్, పూర్బ మేదినీపూర్ జిల్లా నందిగ్రామ్​లో అల్లర్లు ఎక్కువగా జరిగాయన్నారు. చాలాచోట్ల కట్టెలు, రాళ్లతో దాడులు చేసుకున్నారని, ఇండ్లకు, వెహికల్స్ కు నిప్పు పెట్టారని తెలిపారు. కొన్నిచోట్ల నాటు బాంబులు సైతం విసురుకున్నారని పేర్కొన్నారు. పలు చోట్ల బ్యాలెట్ బాక్సులను సైతం ఎత్తుకెళ్లి తగులబెట్టారని వివరించారు. కాగా, బెంగాల్ పంచాయతీ ఎన్నికల ప్రకటన జూన్ 8న వచ్చింది. అప్పటి నుంచే పార్టీల మధ్య గొడవలు మొదలయ్యాయి. వీటిలో శుక్రవారం దాకా19 మంది చనిపోయారు. శనివారం12 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 31కి చేరింది.

గవర్నర్ పర్యటన 

ఉత్తర 24 పరగణాల జిల్లాలో హింస జరిగిన పలు చోట్ల గవర్నర్ సీవీ ఆనంద బోస్ పర్యటించారు. గాయపడిన వారిని పరామర్శించి, అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.    

రీపోల్ డిమాండ్లను పరిశీలిస్తాం: ఎస్ఈసీ 

బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస జరిగిన చోట్ల రీపోలింగ్ నిర్వహించాలన్న డిమాండ్లను, ఓట్ ట్యాంపరింగ్ ఫిర్యాదులను పరిశీలిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాజీవ సిన్హా వెల్లడించారు. రిటర్నింగ్ ఆఫీసర్లు, ఎన్నికల పరిశీలకుల నుంచి నివేదికలు అందిన తర్వాత రీపోలింగ్ ఎక్కడెక్కడ అవసరమన్న దానిపై ఆదివారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  రాష్ట్రంలోని 73,887 స్థానాలకు గాను శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2.06 లక్షల మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 66.2% పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు.

రాష్ట్రపతి పాలన పెట్టాలె: బీజేపీ 

సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా జరిగే అవకాశంలేదని, అందుకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టి, ఆ తర్వాత ఎన్నికలు జరిపించాలని బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సువేందు అధికారి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హింసకు వ్యతిరేకంగా మమత నివాసం ఉన్న కాళీఘాట్ వరకు ర్యాలీ చేపడతానని హెచ్చరించారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతోనూ సువేందు ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ఆయనకు వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే పనిచేస్తోందని, ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో ఫెయిల్ అయిందని బీజేపీ నేత రాహుల్ సిన్హా అన్నారు.

ప్రతిపక్షాల కుమ్మక్కు: టీఎంసీ

బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు అయి తృణమూల్ నేతలు, కార్యకర్తలపై దాడు లకు పాల్పడ్డాయని రాష్ట్ర మంత్రి శశి పంజా అన్నారు. కేంద్ర బలగాలు వచ్చినా హింసను కట్టడి చేయలేదని ఆమె ఆరోపించారు. రాష్ట్రం లో ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 17 మంది తృణమూల్ కార్యక ర్తలు చనిపోయారని, ఎన్నికల్లో హింస వెనక తమ పార్టీ ఉంటే.. తమ కార్యకర్తలపైనే దాడు లు ఎందుకు జరుగుతున్నా యని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 60 వేల పోలింగ్ బూత్ లు ఉండగా, 60 కీలకమైన బూత్ లలోనే పోలింగ్ ప్రక్రియకు అడ్డంకులు కల్పించారని పేర్కొన్నారు.

ఎన్నికలను రద్దు చేయాలె: కాంగ్రెస్ 

పంచాయతీ ఎన్నికల్లో భారీగా హింస, హత్యలు జరిగినందున ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ కు కాంగ్రెస్ నేత కౌస్తవ్ బాగ్చి మెమోరాండం సమర్పించారు. రాష్ట్రంలో అధికార టీఎంసీకి చెందిన గూండాలు స్వేచ్ఛగా తిరుగుతూ దాడులు చేస్తున్నారని కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఆధిర్ చౌధరీ ఆరోపించారు. కాగా, కేంద్ర బలగాలను కావాలనే ఆయా పోలింగ్ బూత్ లకు తరలించలేదని సీపీఎం బెంగాల్ సెక్రటరీ ఎండీ సలీమ్ అన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా.. రాష్ట్ర, కేంద్ర బలగాల మధ్య సమన్వయం లోపించడం వల్లే హింస జరిగిందన్నారు. ఎన్నికల్లో గొడవలన్నింటికీ అధికార తృణమూల్ పార్టీనే కారణమని సీపీఎం నేత సుజన్ చక్రబర్తి అన్నారు.