కోల్‌కతా ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీ జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు సీల్ధా జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించడాన్ని సవాల్ చేస్తూ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. వైద్యురాలిపై అత్యంత పాశవికంగా హత్యాచారానికి పాల్పడిన దోషి సంజయ్ రాయ్‌కు ఉరి శిక్ష విధించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
వెస్ట్ బెంగాల్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు రిజస్ట్రీ విచారణకు స్వీకరించారు. త్వరలోనే విచారణ తేదీలు వెల్లడిస్తామన్నారు. దీంతో వైద్యురాలిపై హత్యాచారా కేసులో హై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీల్ధా జిల్లా కోర్టు తీర్పును సమర్థిస్తుందా..? లేక బెంగాల్ సర్కార్ విజ్ఞప్తి మేరకు దోషికి ఉరి శిక్ష విధిస్తుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.
కాగా, ఆర్జీకర్ ఆసుపత్రి జూనియర్ వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన దోషి సంజయ్ రాయ్‌కు సీల్ధా జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై వెస్ట్ బెంగాల్ సీఎం సీఎం మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యురాలిపై దారుణంగా హత్యాచారానికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు కాదని.. ఉరి శిక్ష విధించాలన్నారు. నిందితుడికి ఉరి పడేలా హైకోర్టును ఆశ్రయిస్తామని ఆమె తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు బెంగాల్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది.
అసలు కేసు ఏంటంటే..?
2024, ఆగస్ట్ 9వ తేదీన కోల్‌కత్తాలోని ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. డ్యూటీలో ఉన్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసింది అదే ఆసుపత్రిలో సివిక్ వాలంటీర్‌గా పని చేసే సంజయ్ రాయ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు 2025, ఆగస్ట్ 10న నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ALSO READ | కేసు మాకు అప్పగిస్తే..సంజయ్ రాయ్‌కు మరణశిక్ష పడేలా చూసేవాళ్లం: మమతా బెనర్జీ
ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో కోల్కత్తా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టింది. మొత్తం 120 మంది సాక్ష్యులను విచారించిన సీబీఐ.. బలమైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పించింది. నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ సైతం నిర్వహించింది. సంజయ్ రాయ్‌కు వ్యతిరేకంగా సీబీఐ కోర్టుకు బలమైన ఆధారాలు సమర్పించింది. సీబీఐ సాక్ష్యాల ఆధారంగా సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌ను దోషిగా తేల్చింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది.