తణుకు పోలీస్ SI.. స్టేషన్లోనే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు

తణుకు పోలీస్ SI.. స్టేషన్లోనే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు


ఏపీ పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్సై ఏజీఎస్ మూర్తి సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం (జనవరి 31) ఉదయం విధులకు హాజరైన ఎస్సై మూర్తి.. స్టేషన్ లో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఎస్సై మూర్తిపై ఇటీవల పలు అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం స్టేషన్‌కు వచ్చిన మూర్తి.. పోలీసులు చూస్తుండగానే  రివార్వల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 సమాచారం తెలుసుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని  హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఎస్సై అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఎలాంటి అవినీతికి పాల్పడకపోయినా సస్పెండ్ చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని విలపిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనంగా మారిన ఎస్సై ఆత్మహత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.