వెస్టిండీస్(West Indies) ఆల్‌రౌండర్, మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్(Sunil Narine) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపాడు. విండీస్ జట్టుకు ఆడి నాలుగేళ్లు అవుతోందన్న నరైన్.. తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని వెల్లడించాడు. అయితే, ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని వెల్లడించాడు.
"బహిరంగంగా నేను చాలా తక్కువ మాటలు మాట్లాడే వ్యక్తిని. మీరూ చూసే ఉంటారు. చివరిసారిగా నేను దేశానికి(వెస్టిండీస్) ఆడి 4 సంవత్సరాలు పైబడుతోంది. ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. వెస్టిండీస్‌కు ఆడాలనే నా కలను సాకారం చేయడంలో నాకు సహాయపడిన వారందరికీ నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నా కుటుంబం, నా తండ్రి నా కల సాకారంకోవడంలో ఎంతో సాయపడ్డారు. వారి ప్రేమకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.. ఇన్నాళ్లు నన్ను ఆదరించిన వారి ప్రేమకు కృతజ్ఞతుడ్ని.." అని నరైన్ ఇన్‌స్టా వేదికగా రిటైర్మెంట్ ప్రకటన చేశాడు.
నరైన్.. కేకేఆర్
35 ఏళ్ల నరైన్ తన కెరీర్లో అంతర్జాతీయంగా 65 వన్డేలు, 51 టీ20లు, 6 టెస్టులు ఆడాడు. అన్ని ఫార్మాట్‌లలో కలిపి 165 వికెట్లు పడగొట్టాడు. ఇక నరైన్ అందరికీ ముందుగా గుర్తొచ్చేది.. ఐపీఎల్ ప్రాంచైజీ కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders). నరైన్ 2012 నుండి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. కేకేఆర్ తరపున 162 మ్యాచ్ లు ఆడిన నరైన్ 163 వికెట్లు పడగొట్టాడు. బెస్ట్ 19/5గా ఉండగా.. ఎకానమీ 6.73గా ఉంది.