- అఫ్గానిస్థాన్‌పై 23 రన్స్‌తో విండీస్ గెలుపు
- రాణించిన హోప్, పూరన్, లూయిస్
భారీ అంచనాలు లేకపోయినా.. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగినా.. అదిరిపోయే ఆటతీరుతో వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన విండీస్.. చివరి మ్యాచ్‌లో మళ్లీ ఆ స్థాయిలో చెలరేగింది. సెమీస్ రేస్‌కు దూరమైనా.. సమష్టిగా రాణించి ఓదార్పు విజయంతో టోర్నీని ముగించింది. హోప్ (92 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 77), లూయిస్ (78 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58), పూరన్ (43 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 58) అర్ధసెంచరీలతో విజృంభించడంతో.. పసికూన అఫ్గానిస్థాన్‌పై గెలిచి పరువును కాపాడుకుంది. మరోవైపు టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే అఫ్గాన్ మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించింది.
లీడ్స్: వరల్డ్‌కప్‌లో విండీస్ పోరాటం విజయంతో ముగిసింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కరీబియన్లు.. గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 23 రన్స్ తేడాతో అఫ్గానిస్థాన్‌పై గెలిచింది. దీంతో ఐదు పరాజయాల తర్వాత ఓదార్పు విక్టరీ కొట్టింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 రన్స్ చేసింది. అనంతరం ఓవర్లన్నీ ఆడిన అఫ్గానిస్థాన్ 288కి ఆలౌటైంది. ఇక్రామ్ (93 బంతుల్లో 8 ఫోర్లతో 86), రహ్మత్ షా (78 బంతుల్లో 10 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించినా ప్రయోజనం లేకపోయింది. బ్రాత్‌వైట్(4/63), కీమర్ రోచ్ (3/37) అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను కూల్చారు. హోప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.
ఇక్రామ్, రహ్మత్ పోరాటం..
భారీ ఛేజింగ్‌లో ఇక్రామ్, రహ్మత్ షా అఫ్గాన్ శిబిరంలో గెలుపు ఆశలు రేపారు. సెకండ్ వికెట్‌కు 133 రన్స్ జోడించిన వీరిద్దరూ విండీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. రెండో ఓవర్‌లోనే కెప్టెన్ నైబ్(5) వికెట్ కోల్పోయిన ఆ జట్టు రహ్మత్, ఇక్రామ్ దూకుడుతో మ్యాచ్ గెలిచేలా కనిపించింది. ఫస్ట్ పవర్ ప్లేలో 44 రన్స్ చేసిన అఫ్గాన్ 20 ఓవర్లు ముగిసే సరికి 101 రన్స్ చేసింది. రహ్మత్ షా 52 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, నెమ్మదిగా స్పీడు పెంచిన ఇక్రామ్ 57 బంతుల్లో 50 రన్స్ చేశాడు. 18 ఏళ్ల ఇక్రామ్ వరల్డ్‌కప్‌లో ఈ ఘనత సాధించిన పిన్నవయస్కుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 26వ ఓవర్‌లో రహ్మత్‌ను ఔట్ చేసిన బ్రాత్‌వైట్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నజిబుల్లా (31) కూడా ఇక్రామ్‌తో కలిసి దూకుడుగా ఆడడంతో విండీస్‌కు ఓటమి తప్పదనిపించింది.
మలుపు తిప్పిన గేల్
గేల్ 36వ ఓవర్‌లో విండీస్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తెచ్చాడు. ఇక్రామ్.. గేల్‌కు వికెట్ల ముందు దొరికిపోగా, ఆ ఓవర్ ఐదో బంతికి నజిబుల్లా రనౌటయ్యాడు. ఆ తర్వాత స్వల్ప తేడాలో నబీ (2), షెన్వారీ (6) వికెట్లు తీసిన రోచ్ విండీస్‌ను విజయం వైపు మళ్లించాడు. అస్గర్ అఫ్గాన్ (40)ను బ్రాత్‌వైట్ ఔట్ చేయడంతో అఫ్గాన్‌కు ఓటమి తప్పలేదు.
బ్యాటింగ్ హిట్
వరల్డ్‌కప్‌లో చివరి మ్యాచ్ కావడంతో కరీబియన్ బ్యాట్స్‌మెన్ ఉమ్మడిగా రాణించారు. కెరీర్‌లో చివరి వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడేసిన గేల్ (7) మినహా క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ అందరూ సత్తా చాటారు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్‌కు దౌలత్ వేసిన ఆరో ఓవర్‌లో షాక్ తగిలింది. గేల్ రెండంకెల స్కోరు చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. దీంతో మరో ఓపెనర్ లూయిస్‌కు హోప్ జత కలిశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 88 రన్స్ జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. 25వ ఓవర్‌లో రషీద్ ఈ జోడిని వీడదీయగా, హెట్‌మయర్(39), హోప్‌తో కలిసి చకాచకా పరుగులు చేశాడు. వీరిద్దరూ 20 రన్స్ తేడాలో పెవిలియన్ చేరినా 38 ఓవర్లు ముగిసే సరికి 192/4 స్కోరుతో విండీస్ బలమైన స్థితిలో నిలిచింది. హాఫ్ సెంచరీ చేసిన హోప్‌ని నబీ ఔట్ చేయగా, హెట్‌మయర్ వికెట్ దౌలత్‌కు దక్కింది. వీరిద్దరి ఔట్‌తో క్రీజులో వచ్చిన పూరన్(58), కెప్టెన్ హోల్డర్(45) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. శ్రీలంకపై సెంచరీ చేసిన పూరన్ ఫామ్ కొనసాగించగా, హోల్డర్ నాలుగు భారీ సిక్సర్లతో చెలరేగాడు. షిర్‌జాద్ వేసిన ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కు పూరన్ రనౌట్ అవ్వగా, తర్వాతి బాల్‌కు హోల్డర్ పెవిలియన్ చేరాడు. అయితే చివరి మూడు బంతుల్లో వరుసగా 6, 4, 4 కొట్టిన బ్రాత్‌వైట్(14 నాటౌట్) జట్టు స్కోరును 300 దాటించి ఇన్నింగ్స్‌కు అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చాడు.
స్కోర్‌బోర్డ్
వెస్టిండీస్ : గేల్ (సి) ఇక్రామ్ (బి) దౌలత్ 7, లూయిస్ (సి) నబీ (బి) రషీద్ 58, హోప్ (సి) రషీద్ (బి) నబీ 77, హెట్‌మయర్ (సి) సబ్/నూర్ అలీ (బి)దౌలత్ 39, పూరన్ (రనాట్) 58, హోల్డర్ (సి) దౌలత్ (బి) షిర్‌జాద్ 45, బ్రాత్‌వైట్ (నాటౌట్) 14, అలెన్ (నాటౌట్) 0 ; ఎక్స్‌ట్రాలు : 13 ; మొత్తం : 50 ఓవర్లలో 311/6 ; వికెట్ల పతనం :1–21, 2–109, 3–174, 4–192, 5–297, 6–297 ;బౌలింగ్ : ముజీబుర్ 10–0–52–0, దౌలత్ 9–1–73–2, షిర్‌జాద్ 8–0–56–1, నైబ్ 3–0–18–0, నబీ 10–0–56–1, రషీద్‌ఖాన్ 10–0–52–1.
అఫ్గానిస్థాన్ : నైబ్ (సి) లూయిస్ (బి) రోచ్ 5, రహ్మత్ షా (సి) గేల్ (బి) బ్రాత్‌వైట్ 62, ఇక్రమ్(ఎల్బీ) గేల్ 86, నజిబుల్లా (రనౌట్) 31, అస్గర్ (సి) హోల్డర్ (బి) బ్రాత్‌వైట్ 40, నబీ(సి) అలెన్ (బి) రోచ్ 2, షిన్వారీ (సి) హెట్‌మయర్ (బి) రోచ్ 6, రషీద్ (సి) హోల్డర్ (బి) బ్రాత్‌వైట్ 9, దౌలత్ (సి) కోట్రెల్ (బి) బ్రాత్‌వైట్ 1, షిర్‌జాద్ (సి) అలెన్ (బి) థామస్ 25, ముజీబుర్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు : 14 ; మొత్తం : 50 ఓవర్లలో 288 ఆలౌట్; వికెట్ల పతనం : 1–5, 2–138, 3–189, 4–194, 5–201, 6–227, 7–244, 8–255, 9–260, 10–288 ; బౌలింగ్ : కోట్రెల్ 7–0–43–0, రోచ్ 10–2–37–3, థామస్ 7–0–43–1, హోల్డర్ 8–0–46–0, అలెన్ 3–0–26–0, బ్రాత్‌వైట్ 9–0–63–4, గేల్ 6–0–28–1.