రెండోదీ విండీస్​దే.. 2 వికెట్ల తేడాతో ఇండియాపై గెలుపు

రెండోదీ విండీస్​దే.. 2 వికెట్ల తేడాతో ఇండియాపై గెలుపు

గయానా:  కరీబియన్‌‌ గడ్డపై షార్ట్‌‌ ఫార్మాట్‌‌ ఇండియాకు కలిసి రావడం లేదు. తొలి టీ20లో బ్యాటర్లు ఫెయిలైతే.. రెండో మ్యాచ్‌‌లో బౌలర్లు ఆఖర్లో చేతులెత్తేశారు. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో విండీస్‌‌ చేతిలో ఓడింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో కరీబియన్‌‌ టీమ్‌‌ 2–0 లీడ్‌‌లో నిలిచింది. టాస్‌‌ గెలిచిన ఇండియా 20 ఓవర్లలో 152/7 స్కోరు చేసింది. తెలుగు బ్యాటర్‌‌ తిలక్‌‌ వర్మ (51) హాఫ్‌‌ సెంచరీ చేశాడు. తర్వాత విండీస్‌‌ 18.5 ఓవర్లలో 155/8 స్కోరు చేసింది. నికోలస్‌‌ పూరన్‌‌ (67), హెట్‌‌మయర్‌‌ (22) రాణించారు. పాండ్యా 3 వికెట్లు తీశాడు. పూరన్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

మళ్లీ మెరిసిన తిలక్‌‌

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియాను విండీస్​ బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్లలో ఇషాన్‌‌ (27) మెరుగ్గా ఆడినా గిల్‌‌ (7), సూర్యకుమార్‌‌ (1) ఫెయిలయ్యారు. 18 రన్స్‌‌కే ఈ ఇద్దరూ పెవిలియన్‌‌కు చేరారు. ఇషాన్‌‌తో జతకలిసిన తిలక్‌‌ వర్మ సూపర్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆడాడు. స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ సింగిల్స్‌‌, డబుల్స్‌‌తో స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో ఇషాన్‌‌ కూడా అకీల్‌‌ హోసేన్‌‌ (2/29) బౌలింగ్‌‌లో భారీ సిక్సర్‌‌తో రెచ్చిపోయాడు. కానీ దురదృష్టంకొద్దీ10వ ఓవర్‌‌లో షెపర్డ్‌‌ (2/28)కు వికెట్ ఇవ్వడంతో మూడో వికెట్‌‌కు 42 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 12వ ఓవర్‌‌లో శాంసన్‌‌ భారీ షాట్‌‌కు యత్నించి స్టంపౌట్‌‌ కావడంతో ఇండియా స్కోరు 76/4గా మారింది. ఈ దశలో హార్దిక్‌‌ (24), తిలక్‌‌.. కరీబియన్‌‌ బౌలింగ్‌‌ను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తిలక్‌‌ 39 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇండియా తరఫున టీ20ల్లో హాఫ్‌‌ సెంచరీ చేసిన యంగెస్ట్‌‌ బ్యాటర్‌‌గా రికార్డులకెక్కాడు. 16వ ఓవర్‌‌లో హార్దిక్‌‌ సిక్స్‌‌ కొడితే ఐదో బాల్‌‌కు తిలక్‌‌ ఔటయ్యాడు. ఐదో వికెట్‌‌కు 38 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 18వ ఓవర్‌‌లో హార్దిక్‌‌ కూడా వెనుదిరిగినా.. చివర్లో అక్షర్‌‌ పటేల్‌‌ (14), రవి బిష్ణోయ్‌‌ 
(8 నాటౌట్‌‌), అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌ (6 నాటౌట్‌‌) భారీ షాట్లు కొట్టడంతో మంచి టార్గెట్‌‌ వచ్చింది.  

పూరన్‌‌ ధనాధన్‌‌

ఛేజింగ్‌‌లో తొలి ఓవర్‌‌లోనే పాండ్యా.. విండీస్‌‌కు డబుల్‌‌ ఝలక్‌‌ ఇచ్చాడు. నాలుగు బాల్స్‌‌ తేడాలో బ్రెండన్‌‌ కింగ్‌‌ (0), జాసన్‌‌ చార్లెస్‌‌ (2)ను ఔట్‌‌ చేయడంతో స్కోరు 2/2గా మారింది. ఈ దశలో కైల్‌‌ మేయర్స్‌‌ (15), పూరన్‌‌ టీమిండియా బౌలింగ్‌‌ను ఉతికేశారు. ఇద్దరు కలిసి 6, 4, 4, 4, 6తో రెచ్చిపోయారు. అయితే జోరుమీదున్న ఈ జోడీని అర్ష్‌‌దీప్‌‌.. మేయర్స్‌‌ను ఔట్‌‌ చేసి విడగొట్టాడు. మూడో వికెట్‌‌కు 30 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. తర్వాత వచ్చిన పావెల్‌‌ (21) కూడా పూరన్‌‌కు మంచి సహకారం అందించాడు. పూరన్‌‌ 4, 4, 4, 6, 4, 4, పావెల్‌‌ 6 కొట్టడంతో పవర్‌‌ప్లేలో విండీస్‌‌ 61/3 స్కోరు చేసింది. తర్వాత మరో ఫోర్‌‌, సిక్స్‌‌ కొట్టిన పావెల్‌‌ 10వ ఓవర్‌‌లో పాండ్యాకు వికెట్‌‌ ఇచ్చాడు. 

దీంతో నాలుగో వికెట్‌‌కు 57 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. 14వ ఓవర్‌‌లో సిక్స్‌‌ కొట్టి పూరన్‌‌ ఔట్‌‌కావడంతో ఇన్నింగ్స్‌‌ తడబడింది. 15 ఓవర్లలో 127/5తో ఉన్న విండీస్‌‌ను 16వ ఓవర్‌‌లో చహల్‌‌ (2/19) దెబ్బ కొట్టాడు. షెపర్డ్‌‌ (0) రనౌట్‌‌కాగా, మూడు బాల్స్‌‌ తేడాలో హోల్డర్‌‌ (0), హెట్‌‌మయర్‌‌ను ఔట్‌‌ చేశాడు. దీంతో స్కోరు 129/8గా మారింది. ఇక 24 బాల్స్‌‌లో 24 రన్స్‌‌ చేయాల్సిన దశలో అకీల్‌‌ హోసేన్‌‌ (16 నాటౌట్‌‌), అల్జారీ జోసెఫ్‌‌ (10 నాటౌట్‌‌) నిలకడగా ఆడి గెలిపించారు.