
ముల్తాన్ : స్పిన్నర్ జోమెల్ వారికన్ (5/27) ఐదు వికెట్లతో సత్తా చాటడంతో రెండో, చివరి టెస్టులో పాకిస్తాన్‌పై వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. మూడో రోజు సోమవారం ముగిసిన మ్యాచ్‌లో 120 రన్స్ తేడాతో పాక్‌ను చిత్తు చేసిన విండీస్ సిరీస్‌ను 1–1తో డ్రా చేసుకుంది. పాక్ గడ్డపై 34 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరీబియన్ జట్టు విజయం సాధించడం విశేషం.
ఆ జట్టు ఇచ్చిన 254 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 76/4తో ఆట కొనసాగించిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 133 రన్స్‌కే ఆలౌటైంది. మహ్మద్ రిజ్వాన్ (25) మాత్రమే కాసేపు ప్రతిఘటించాడు. విండీస్ బౌలర్లలో వారికన్‌కు తోడు కెవిన్ సంక్లైర్ మూడు, గుడకేశ్ మోతీ రెండు వికెట్లు పడగొట్టారు. వారికన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.