T20 World Cup 2024: వణికిస్తున్న చిన్న జట్లు.. హోరా హోరీగా వరల్డ్ కప్ మ్యాచ్‌లు

T20 World Cup 2024: వణికిస్తున్న చిన్న జట్లు.. హోరా హోరీగా వరల్డ్ కప్ మ్యాచ్‌లు

వరల్డ్ కప్ లో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 20 జట్లు బరిలోకి దిగాయి. మొత్తం 10 వేదికలు.. 55 మ్యాచ్ లతో ఈ సారి గ్రాండ్ గా పొట్టి టోర్నీ జరిపేందుకు ఐసీసీ సిద్ధమైంది. అయితే 20 జట్లు అనేసరికి సగటు క్రికెట్ అభిమానుల్లో కొంచెం బోర్ కొట్టడం కామన్. ఎందుకంటే మొత్తం నాలుగు గ్రూప్ లుగా విభజిస్తే ప్రతి గ్రూప్ లో 5 టీమ్స్ ఉన్నాయి. రెండు బలమైన జట్లతో పాటు.. మూడు బలహీన జట్లు ఉన్నాయి. దీంతో బలమైన రెండు జట్లు తర్వాత రౌండ్ కు వెళ్తాయని.. చిన్న జట్లు కనీసం పోటీ కూడా ఇవ్వలేవని అనుకున్నారు. వీటన్నిటికీ భిన్నంగా వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. 

సంచలనాలు సృష్టించకపోయినా.. పెద్ద జట్లను వణికిస్తున్నాయి. కెనడా, ఒమన్, పపువా న్యూ గినియా లాంటి జట్లు ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో విజయం అంచుల వరకు వచ్చి వెళ్లాయి. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్ లో కెనడా ఒకదశలో విజయం దిశగా దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన కెనడా 20 ఓవర్లలో 194 పరుగులు చేస్తే.. ఛేజింగ్ లో అమెరికాను తొలి 8 ఓవర్లలో సమర్ధవంతంగా అడ్డుకున్నారు. 8 ఓవర్లలో 2 వికెట్లను 48 పరుగులు చేయడంతో సంచలనం గ్యారంటీ అనుకున్నారంతా. అయితే జోన్స్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో ఆతిధ్య అమెరికా గట్టెక్కింది. 

ఆదివారం (జూన్ 2) రాత్రి వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో పపువా న్యూ గినియా విజయం కోసం చివరి ఓవర్ వరకు పోరాడింది. మొదట బ్యాటింగ్ లో విఫలమై 136 పరుగులు చేసినా.. బౌలింగ్ లో కట్టుదిట్టంగా విండీస్ ను అడ్డకుంది. లక్ష్య ఛేదనలో అప్పటికే 5 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్  చివరి మూడు ఓవర్లలో 37 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో పపువా న్యూ గినియా సొంతగడ్డపై విండీస్ కు షాక్ ఇచ్చేలా కనిపించింది. అయితే ఛేజ్ చివర్లో బౌండరీల వర్షం కురిపించి విండీస్ ను విజయతీరాలకు చేర్చాడు. 

ఒమన్ జట్టు తొలి మ్యాచ్ లోనే ఆకట్టుకుంది. తమకంటే బలమైన నమీబియా జట్టును దాదాపుగా ఓడించినంత పని చేసింది. మొదట బ్యాటింగ్ లో 109 పరుగులే చేసినా.. బౌలింగ్ లో అంచనాలకు మించి రాణించారు. నమీబియా కూడా 109 పరుగులకు పరిమితం చేసి వారి విజయాన్ని అడ్డుకున్నారు. అయితే సూపర్ ఓవర్ లో నమీబియా విజృంభించడంతో ఒమన్ జట్టుకు నిరాశ తప్పలేదు. ఈ వరల్డ్ కప్ లో చిన్న జట్లను తేలిగ్గా తీసుకుంటే సంచలనాలు సృష్టించడం ఖాయం. మరి  వరల్డ్ కప్ లీగ్ దశలో ఎన్ని సంచలన ఫలితాలు నమోదవుతాయో చూడాలి.