వీడియో: కోహ్లీని హత్తుకుని.. విండీస్ క్రికెటర్ తల్లి భావోద్వేగం

వీడియో: కోహ్లీని హత్తుకుని.. విండీస్ క్రికెటర్ తల్లి భావోద్వేగం

ఎవరు ఔనన్నా, కాదన్నా.. క్రికెట్ ప్రపంచనానికి రారాజు విరాట్ కోహ్లీ. ఆటలో అతని కంటే గొప్పగా రాణించిన వారు ఉండొచ్చు కానీ, అభిమానులు మనసులో చోటు సంపాదించడంలో మాత్రం అతనే టాప్. అది నిజమని చెప్పటానికి ఈ వీడియో ఒక్కటి చాలు. ఒక తల్లిగా కొడుకుని చూసి గర్వపడటం, ఆనందపడటం సహజం. కానీ, కొడుకుని మించిన అభిమానం కోహ్లీపై చూపింది.. ఆ తల్లి. ఆమె చూపిన ఈ అభిమానం ప్రేక్షకులను కూడా కంటతడి పెట్టించింది.

భారత్ - వెస్టిండీస్ మధ్య  పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు ఆటపూర్తయ్యాక భారత ఆటగాళ్లు.. తిరిగి హోటల్‌కు వెళ్లందుకు బస్‌ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో విండీస్‌ వికెట్‌ కీపర్‌ జోషువా డి సిల్వ తల్లి కోహ్లిని కలిసింది. ఆమెకు కోహ్లీ అంటే చాలా అభిమానమట. ఇంకేముంది కోహ్లీని చూడగానే ఆమె ఎమోషనల్ అయిపోయింది. అతడిని మనసారా హత్తుకుని భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు పెట్టుకుంది. కోహ్లీ కూడా ఆమెను ఆప్యాయంగా పలకరించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ సమయంలో ఆ తల్లి చెప్పిన మాటలు అక్కడున్న వారి మనసును కలిచివేశాయి. కొడుకు జాషువాను ఉద్దేశిస్తూ.. 'సన్.. ఫోటో తీయు' అని చెప్పగా, కోహ్లీకి.. "నువ్వు అద్భుతమైన ఆటగాడివి. నీ మనసు చాలా మంచిది. నీకు అందమైన భార్య ఉంది" అని ఆమె కోహ్లీకి చెప్పింది. చివరగా ఆ తల్లి తన కొడుకు టెస్టు ఆడుతున్నా.. తాను మాత్రం  విరాట్ ఆట చూసేందుకే వచ్చానని చెప్పడం కోహ్లీ అంటే ఆమెకు ఎంత అభిమానమో తెలియజెప్పింది.

విరాట్‌ను కలిసిన తర్వాత ఆమె స్పందిస్తూ.. "నా జీవితంలో మొదటిసారి విరాట్‌ను కలిశాను. అతడు చాలా టాలెంటెడ్ క్రికెటర్. విరాట్‌లా నా కొడుకు కూడా అద్భుతంగా ఆడాని కోరుకుంటున్నా. అతని నుండి మరింత నేర్చుకుంటాడని  భావిస్తున్నా.." అని చెప్పుకొచ్చింది.

మా అమ్మ నీకు వీరాభిమాని

సరిగ్గా 24 గంటల క్రితం జాషువా డా సిల్వా.. తన తల్లి కోహ్లీని చూసేందుకు స్టేడియానికి వస్తున్నాయని చెప్పిందని అతనికి చెప్పాడు.  తొలి రోజు ఆటలో కీపింగ్ చేస్తున్న జాషువా డా.. కోహ్లీని ఉద్దేశిస్తూ.. 'మా అమ్మ నీకు వీరాభిమాని. నువ్వు ఆడటం చూసేందుకే వాళ్లు మైదానానికి వస్తుంటారు. మా అమ్మ నాకు ఫోన్ చేసి విరాట్ కోహ్లీ కోసం మ్యాచ్ చూసేందుకు వస్తున్నానని చెప్పింది. నేను నమ్మలేకపోయాను.." అని జాషువా కోహ్లీకి చెప్పాడు. ఈ మాటలన్నీ స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి.