T20 World Cup 2024: వెస్టిండీస్‌కు భారీ దెబ్బ.. మిగిలిన మ్యాచ్‌లకు స్టార్ బ్యాటర్ దూరం!

T20 World Cup 2024: వెస్టిండీస్‌కు భారీ దెబ్బ.. మిగిలిన మ్యాచ్‌లకు స్టార్ బ్యాటర్ దూరం!

ఆతిథ్య దేశం, రెండుసార్లు టీ20 ప్రపంచకప్ విజేత వెస్టిండీస్‌కు భారీ షాకులు తగులుతున్నాయి. గురువారం(జూన్ 20) ఇంగ్లాండ్‌తో జరిగిన సూపర్-8 తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ప్రత్యర్థి జట్టు ముందు 181 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించినప్పటికీ.. కరేబియన్ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ఈ ఓటమి బాధలో ఉన్న విండీస్‌కు మరో ఎదురు దెబ్బె తగిలింది. ఓపెనింగ్ బ్యాటర్ బ్రాండన్ కింగ్ మిగిలిన టోర్నీకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. 

రిటైర్డ్ హర్ట్

ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లో 23 పరుగులతో మంచి టచ్‌లో ఉన్న బ్రాండన్ కింగ్ దురదృష్టవశాత్తూ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సామ్ కర్రన్‌ వేసిన ఇన్నింగ్స్ ఐదవ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి.. గాయం బారిన పడ్డాడు. కండరాలు పట్టేయడం(సైడ్ స్ట్రెయిన్)తో నొప్పితో విలవిలలాడిపోయాడు. అడుగు తీసి అడుగు వేయలేకపోయాడు. చివరకు జట్టు వైద్య సిబ్బంది సహాయంతో మైదానాన్ని వీడాడు. అనంతరం కింగ్ మైదానంలోకి తిరిగి రాలేదు. ఫీల్డర్‌గా అతని స్థానాన్ని హిట్టర్ షిమ్రాన్ హెట్మెయర్ భర్తీ చేశాడు. అతని గాయాన్ని క్రికెట్ వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సైతం ధృవీకరించింది. కింగ్ సైడ్ స్ట్రెయిన్ ఇంజురీతో ఇబ్బంది పడుతున్నాడని ప్రకటించింది. 

వారం రోజుల విశ్రాంతి..!

సైడ్ స్ట్రెయిన్ నుండి పూర్తిగా కోలుకోవడానికి వారం రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుందట. అదే జరిగితే, సూపర్ -8 దశలో వెస్టిండీస్ మిగిలిన టీ20 ప్రపంచ కప్‌లకు ఈ ఓపెనర్ దూరమైనట్టే. దీంతో విండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకోనుంది. జట్టు వైద్య సిబ్బంది ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి ప్రకటన చేయనుంది. ఒకవేళ కింగ్ దూరమైతే, అతని స్థానంలో స్టాండ్‌బై ప్లేయర్లలో ఒకరితో భర్తీ చేయనుంది. కరేబియన్ ప్రపంచకప్ జట్టు స్టాండ్‌బైలో ఆండ్రీ ఫ్లెచర్, కైల్ మేయర్స్, ఫాబియన్ అలెన్, జూనియర్ వాల్ష్, మాథ్యూ ఫోర్డ్ ఉన్నారు. వీరిలో ఫ్లెచర్, కైల్ మేయర్లలో ఒకరికి అవకాశం దక్కనుంది.